దేశంలో కరోనా రికార్డులను తిరగరాస్తోంది. నిన్న ఒక్క రోజే 3 లక్షల 60 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరు రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు 24 శాతంపైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ,మహారాష్ట్ర, గోవా, ఝార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించగా, ప్రతి నలుగురిలో ఒకరు కరోనా పాజిటివ్ గా తేలుతోంది.దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దిశానిర్ధేశం చేసింది. కరోనా కట్టడికి అక్కడి పరిస్థితులను బట్టి కఠిన నిబంధనలు అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. అవసరం అయితే కరోనా వేగంగా వ్యాపిస్తున్న ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే మహారాష్ట్ర, గోవా, తమిళనాడు రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించాయి. కరోనా వేగాన్ని నియంత్రించేందుకు లాక్ డౌన్ ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ సూచనల మేరకు అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
10 శాతం దాటితే మినీ లాక్ డౌన్
కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం దాటిన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో పాక్షిక లాక్ డౌన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. ఆక్సిజన్ ఐసీయూ బెడ్లు 60 శాతం మించి ఆక్యుపేషన్ ఉన్న ప్రాంతాల్లో కూడా మినీ లాక్ డౌన్ తరహా ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి ఆదేశించింది. కేసుల తీవ్రతను గుర్తించిన ప్రాంతాల్లో పట్టణాలు, నగరాలు, జిల్లాలు, వార్డులు, పంచాయతీల వారీగా వర్గీకరించి కఠిన నిబంధనలతో కూడాన కట్టడి చర్యలు చేపట్టాలని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆదేశించారు. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ మరణాలతో బెంబేలెత్తిపోతున్న వ్యాపార వర్గాలు విజయవాడలో స్వచ్ఛందంగా మూసివేసుకుంటున్నారు. పగటి పూట సగం షాపులు కూడా తెరవడం లేదు. ఆదివారం రోజు పూర్తిగా షాపులు మూసి వేస్తున్నారు. సాయంత్రం వరకూ షాపులు తెరచుకునే అవకాశం ఉన్నా చాలా మంది వ్యాపారులు అసలు షాపులు తీయడం లేదు. కరోనాతో చాలా మంది వ్యాపారులు చనిపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో పగటి పూట కూడా విజయవాడలో జనసంచారం తగ్గిపోయింది. అత్యవసరం అయితేనే జనం బయటకు వస్తున్నారు.
మినీ లాక్ డౌన్ తప్పదా?
ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు 24 శాతంగా ఉంది. నిన్న ఒక్క రోజే 12,600పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క రోగులు ప్రాణాలు విడుస్తున్నారు.ఇక కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఏపీలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఏపీలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉండటంతో మినీ లాక్ డౌన్ తప్పదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు త్వరలో ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో మినీ లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉంది.
Must Read ;- కరోనా మానవాళిపై ఎంత పగబట్టిందో.. ఎటు చూసినా ఇబ్బందులే