మహిళలను చేయనిపనులంటూ లేవు.. అంటూనే కొన్నింటికి మీరు తగరు అంటూ నేటికీ మహిళలను వెనక్కు నెట్టుతుంది. విమానాల నుండి లారీల వరకు అలవోకగా నడిపే మహిళలను బస్సు నడపడం మాత్రం చేతకాదంటూ ఉండే వాదనకు జమ్ము కాశ్మీర్‌కు చెందిన పూజాదేవి చెక్ పెట్టారు. ఆడవాళ్లు దేనికైనా సమర్ధులే అని మరోమారు నిరూపించారు.
కుటుంబం కోసం స్టీరింగ్ పట్టింది..
పూజదేవికి చిన్నతనం నుండి డ్రైవింగ్ పట్ల ఆసక్తి మెండు.. కానీ కుటుంబ నేపథ్యం కారణంగా ఆమెకి అది నేర్చుకునే అవకాశం రాలేదు. ఆ తర్వాత భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలు.. ఇలా ఎన్నో సమస్యలు తన చుట్టూ ఉండడంతో ఇక తన ఆసక్తి గురించి ఆలోచించే అవకాశం కూడా రాలేది పూజా దేవికి. కానీ, కుటుంబ సమస్యలు తీర్చడానికి తన చిన్నతనం నుండి ఎంతో ఇష్టపడే డ్రైవింగే ఆసరాగా నిలుస్తుందని పూజాదేవి ఎన్నడూ భావించలేదు.
భర్తమో రోజువారి కూలీ.. సంపాదన చూస్తే అంతంత మాత్రమే.. కుటుంబ పరిస్థితి ఏమో రోజురోజుకూ దిగజారుతుంది. అప్పడే భర్తకు ఆసరాగా నిలవాలని నిర్ణయించుకుంది. భర్తతో తన ఆలోచనను పంచుకుంది. తన ఆసక్తి రూపం ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందుకు భర్త అండ కూడా దొరకడంతో.. ఇంకేముంది వెంటనే డ్రైవింగ్ నేర్చుకుంది. ఆ డ్రైవింగ్‌లో కూడా అత్యత్తుమ ప్రతిభ ప్రదర్శించింది పూజాదేవి. కుటుంబం కోసం టాక్సీ నడిపారు.. డ్రైవింగ్ స్కూల్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా పనిచేశారు. ఆపై ట్రక్కు లాంటి భారీ వాహానాలు కూడా నడిపారు.
బస్సు డ్రైవర్‌గా పనిచేయడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకుని.. జమ్ము-కఠువా బస్సు యూనియన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తన దరఖాస్తును పరిశీలించిన యూనియన్ ఒక అవకాశం కల్పించడానికి ఒప్పుకున్నారు. తన స్వస్ధతలమైనా కఠువా నుండి జమ్ము వరకు అలవోకగా బస్సు నడిపి చూపి అందరి ప్రశంసలు అందుకున్నారు పూజాదేవి. బస్సు నడపడంలో తన మెలకువలు గమనించిన బస్సు యూనియన్ సభ్యులు తనను పొగడ్తలతో ముంచెత్తడం గమనార్హం.
బిడ్డ కూడా తనతోపాటే..
పూజాదేవికి ముగ్గరు పిల్లలు.. అందులో చిన్నవాడు తనని చూడకుండా ఉండలేడని.. కాబట్టి యూనియన్ వాళ్లని సంప్రదించి బాబును కూడా తనతో తీసుకుని వెళ్లెలా అనుమతులు తీసుకున్నారు పూజాదేవి. తన డ్రైవింగ్ వృత్తి గురించే ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘ఆడవాళ్లు యుద్ధ విమానాలే నడుపుతున్నారు.. అలాంటిది బస్సు డ్రైవింగ్ అనేది పెద్ద విషయమా.. అదేమన్నా తప్పా’ అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు పూజాదేవి. ప్రస్తుతం పూజా బస్సు నడుపుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మరి మనం కూడా తన ప్రతిభకు, పట్టుదలకు ఒక హ్యాట్సాప్ చెబుదాం రండి..