మాస్ మహరాజా రవితేజ దూసుకొచ్చేస్తున్నాడు. గత ఏడాది జనవరిలో క్రాక్ లాంటి విజయం తర్వాత విడుదలవుతున్న రవితేజ సినిమా ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. 11వ తేదీన సినిమా విడుదలవుతోంది. మనకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంది. రెండు రోజుల క్రితం సెన్సార్ సభ్యులు ఈ సినిమాని వీక్షించారు. ఇందులో వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుందని అంటున్నారు.
దర్శకుడు రమేష్ వర్మ వినోదానికి ఇందులో పెద్ద పీట వేసినట్టు సమాచారం. రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతీ హీరోయిన్లుగా ఈ సినిమా రూపొందింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఇందులో రవితేజ రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
చిత్ర నిర్మాణ భాగస్వామ సంస్థల్లో ఒకటైన పెన్ మూవీస్ హిందీలో రిలీజ్ చేస్తోంది. కోనేరు సత్యనారాయణ ఈ మూవీని నిర్మించారు. రాక్షసుడు లాంటి విజయం తర్వాత దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగినట్టు తెలుస్తోంది. సెన్సార్ టాక్ పాజిటివ్ గా ఉండటం, ఏపీలో టిక్కెట్ల ధరలు పెంచబోతున్నట్లు సమాచారం తెలియడంతో అందరిలోనూ కొత్త ఉత్సాహం నెలకొంది.