తెలుగులో స్టార్ హీరోలకు కొరియో గ్రఫర్ గా జానీ మాస్టర్ తన దూకుడును కొనసాగిస్తున్నాడు. మాస్ ఆడియన్స్ ని హుషారెత్తించే పాటలకు డాన్స్ ను కంపోజ్ చేయడంలో జానీ మాస్టర్ సిద్ధహస్తుడు. మెగా ఫ్యామిలీ హీరోల పాటలకు మరింత ఊత్సాహంతో ఆయన పనిచేస్తుంటాడు. మెగా ఫ్యామిలీ హీరోలందరితోను ఆయన స్నేహంగా ఉంటాడు. ముఖ్యంగా పవన్ .. చరణ్ ల దగ్గర ఆయనకి కాస్త చనువు ఎక్కువే. అలాంటి ఈ ఇద్దరితో కలిసి జానీ మాస్టర్ ఒక సినిమా చేయనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ చేయనున్న భారీ సినిమా పూర్తయిన తరువాత, ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.
జానీ మాస్టర్ ఒక వైపున కొరియోగ్రఫీని కొనసాగిస్తూనే, మరో వైపున మెగాఫోన్ పట్టుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. అందుకోసం ఒక మంచి కథను సిద్ధం చేసుకుని చాలా రోజుల నుంచి పవన్ కల్యాణ్ ను కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఆయన పవన్ ను కలవలేకపోయాడు. ఇక కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో, ఇటీవలే ఆయన పవన్ కల్యాణ్ ను కలిశాడని అంటున్నారు. ఆయన వినిపించిన కథ నచ్చడంతో, వెంటనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. దర్శకుడిగా కూడా జానీ మాస్టర్ ఎదగాలని కోరుకుంటూ పవన్ అభినందించాడని కూడా అంటున్నారు. అంతేకాదు చరణ్ ను కలిసి ఈ ప్రాజెక్టు గురించి ఒక మాట చెప్పమని పవన్ సలహా కూడా ఇచ్చాడట.
జానీ మాస్టర్ ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చరణ్ ను కలిశాడట. తాను దర్శకుడిగా రంగంలోకి దిగుతున్న విషయాన్ని చరణ్ దగ్గర ప్రస్తావించి, పవన్ కి వినిపించిన కథను గురించి చెప్పాడట. కథ నచ్చడంతో తన బ్యానర్ పై నిర్మించడానికి చరణ్ అంగీకరించినట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది అటుంచితే, ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకుముందు కొరియోగ్రఫర్లుగా మంచి పేరు తెచ్చుకున్న ప్రభుదేవా .. లారెన్స్ , దర్శకులుగా కూడా తమ సత్తా చాటుకున్నారు. జానీ మాస్టర్ కూడా వాళ్ల సరసన నిలుస్తాడేమో చూడాలి.