రాష్ట్రంలో పులి దాడి ఘటనలు వరుసగా కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొద్ది రోజుల కిందట పులి దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే మళ్లీ తాజాగా మరో ఘటన కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగులోకి రావడం ఆ ప్రాంత ప్రజల్లో భాయాందోళనలు కల్గిస్తున్నాయి.
15 ఏళ్ల బాలికపై పులి దాడి చేయడంతో ప్రజలంతా గజగజ వణికిపోతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. 15 ఏళ్ల అమ్మాయి పత్తి చేనులో పత్తి ఏరుతుండగా ఆ బాలికపై పెద్ద పులి దాడి చేసి ఈడ్చుకెళ్లింది. పులి దాడిలో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం కొండపెల్లి గ్రామం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
పగబట్టిన పులి…
ఆదివారం కొంత మందితో కలిసి పసుల నిర్మల(15) చేనులో పత్తి తీసేందుకు వెళ్లింది. ఆ ప్రాంతం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. అయితే ఆ బాలిక మిగతా వారికి దూరంగా ఉన్న చేనులో పత్తి తీస్తుంది. ఇంతలో పత్తి తీస్తున్న సమయంలో నిర్మలపై ఒక్కసారిగా అదును చూసి పెద్ద పులి దాడి చేసి పొదల్లోకి ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ బాలిక పెద్దగా అరుపులు పెట్టింది. నిర్మల కేకలు విన్న మిగతా కూలీలు భయాందోళనకు గురై వారిలో కొందరు కర్రలు తీసుకుని పులి వెంట పరుగులు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే నిర్మల మృతి చెందింది. అయితే నిర్మల మృత దేహానికి తోటి కూలీలు గ్రామానికి తీసుకొస్తుండగా పులి వారిని మళ్లీ వెంబడించింది. దాంతో కూలీలంతా రాళ్లు కర్రలతో పులిపై ఎదురు దాడి చేయడంతో అక్కడి నుంచి పులి జారుకుంది. పోస్టుమార్టం కోసం నిర్మల మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకెళ్తుండగా బెజ్జూరు మండలం గొల్లదేవర సమీపంలో అంబులెన్సుకు పులి అడ్డంగా రావడంతో వాహనాన్ని నిలిపివేసినట్లు అంబులెన్స్ డ్రైవర్ గణేష్ పేర్కొన్నారు. కొంత సమయం తరువాత పులి అడవిలోకి వెళ్లిందన్నాడు. అటవీ శాఖ అధికారులు పులి దాడులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.











