విజయ సాధనకు విజయవాడ కేంద్రంగా ఉద్యమం!
‘‘ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకే మేం వ్యతిరేకం.. విధానాలకు కాదు’’ అంటూ ఏపీ ఉద్యోగులు నినదిస్తున్నారు. కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు తగ్గేది లేదంటూ పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు తెగసిచెబుతున్నారు. గడిచిన వారం రోజులుగా ఉద్యోగ, ఉపాధ్యాయ వినూత్న రీతిలో నిరసనలు, ధర్నాలు చేస్తూ ఉద్యమిస్తున్నారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్న నేపధ్యంలో వచ్చె నెల 3న విజయవాడ కేంద్రంగా ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమౌతున్నారు. లక్షమంది ఉద్యోగులు తరలిరావాలని రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని స్టీరింగ్ కమిటి సభ్యులు మండిపడుతున్నారు. ఈ తరుణంలోనే ఉద్యోగుల ఐక్యతను చాటేందుకు విజయవాడ కేంద్రం లక్షమందితో చేస్తున్న భారీ ర్యాలీ, ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు నేతలు!
ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ఆపితే మంచిది!
వైసీపీ అధ్యక్షుడి హోదాలో ఎన్నికలకు ముందు ఉద్యోగులకిచ్చిన హామీని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తరువాత జగన్ రెడ్డి నెరవేర్చలేకపోయాడు! ఇది వాస్తవం! హామీల వైఫల్యాన్ని, లోపాన్ని కప్పిపెట్టి.. ఉద్యోగులను బ్లేం చేయాలని చూస్తే ఎలా? అన్నదే జేఏసీ నేతల ప్రధాన వాదన! ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఆపకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పీఆర్సీ సాధన సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పీఆర్సీ జీవోలతో ప్రతి ఉద్యోగి ఇబ్బందులు పడుతున్నారని, పాత జీతాలనే ఇవ్వాలని కోరినా.. నేటికి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందిని అవేదన వ్యక్తం చేశారు. మంత్రుల కమిటీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం అని ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే తమ పోరాటం మరింత ఉధృతం అవుతూనే ఉంటుందని ఆయన హెచ్చరించారు.