సినిమా థియేటర్ల మనుగడకే ముప్పు వాటిల్లుతోందా? ఏపీ పరిస్థితి మాటేమోగాని తెలంగాణలో ఎగ్జిబిటర్లు మాత్రం ఆందోళనలో ఉన్నారు. కరోనా కాలంలో సినిమా థియేటర్లు మూతపడి ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోయారు. ఎట్టకేలకు ప్రభుత్వం దశల వారీగా థియేటర్ల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. మొదట్లో 50 శాతం సీటింగ్, ఆ తర్వాత 100 శాతం సీటింగ్ తో థియేటర్లు ప్రారంభమయ్యాయి. సినీ పరిశ్రమ తరఫున మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు లాంటి సినీ పెద్దలు ప్రభుత్వంలో సంప్రదింపులు జరిపి థియేటర్ల ప్రారంభం విషయంలో తమ వంతు కృషి చేశారు.
అంతా బాగానే ఉందిగానీ ఎగ్జిబిటర్లకు రాయితీల అమలు విషయంలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. మరో పక్క అసలు సినిమా థియేటర్ల వ్యవస్థే సంక్షోభంలో కూరుకుపోయింది. మల్టీప్లెక్సుల ముందు సాధారణ థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే చాలా థియేటర్లు మూతపడిపోయాయి. మరికొన్ని థియేటర్లు షాపింగ్ కాంప్లెక్సులుగా, కళ్యాణ మండపాలుగా మారిపోయాయి. ఎగ్జిబిటర్ల మనుగడకు ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే ప్రభుత్వం ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశమైంది.

థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుపై థియేటర్ల యాజమాన్యాలకే పూర్తి హక్కులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. అలాగే మరికొన్ని డిమాండ్లను కూడా ఈ సమావేశం ప్రభుత్వం ముందుంచింది. సినిమా థియేటర్ల కరెంటు ఛార్జీజు మాఫీ చేయాలన్నది ప్రధానమైన డిమాండు. అలాగే టిక్కెట్ రేటు పెంచుకునే వెసులు బాటు కల్పించాలని కూడా కోరుతున్నారు. అయితే దీని వల్ల ప్రేక్షకులపై అదనపు భారం పడక తప్పదు. ఇది సరైన డిమాండుగా అనిపించడం లేదు. ఇప్పటికే సినిమా థియేటర్ కు వెళ్లి సినిమా చూడటం అనేది పెద్దగా భారంగా జనం భావిస్తున్నారు. థియేర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య ఇప్పటికే తగ్గిపోయింది.
Must Read ;- కరోనా కాలంలో డరోనా వ్యాపారం చేసిన ఓటీటీలు
టిక్కెట్ రేటు పెంచితే ఎలా?
టిక్కెట్ రేట్లు పెంచితే జనం థియేటర్లకు రావడం మానేసే ప్రమాదం ఉంది. ఇక థియేటర్లలో అదనపు షోలు ప్రదర్శించుకునేలా ప్రభుత్వం జీవో జారీ చేసినా అది ఇంకా అమలులోకి రాలేదు. ఈ జీవో అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఫ్రీ పార్కింగ్ కు బదులు నామినల్ ఫీజు వసూలు చేసుకునే ఏర్పాటు కావాలంటున్నారు. ఇప్పటికే మల్టీప్లెక్సుల్లో టిక్కెట్ ధర ఎక్కువ, అలాగే ఈ థియేటర్లలో భారీగా పార్కింగ్ ఫీజులు వసూలు చేయడం, క్యాంటిన్ లలో అధిక రేట్లు వసూలు చేయడం లాంటి అంశాలన్నీ వివాదాస్పదమయ్యాయి.
ఆ విషయంలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని దేవి థయేటర్ యజమాని గోవింద్ రాజ్ నిన్నటి సమావేశంలో అభిప్రాయపడ్డారు. పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవడం వల్ల ఎగ్జిబిటర్లకు కొంతలో కొంత ఊరట కలుగుతుందని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రెటరీ విజయేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చిరంజీవి, నాగార్జున కలిసినప్పుడు ప్రభుత్వం ఎన్నో హామీలను ఇచ్చినా వాటిని ఇంతవరకూ అమలు చేయకపోవడం శోచనీయం. సినిమా రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ రంగంలో సంక్షోభంలో కూరుకుపోకుండా ఉండే అవకాశం కలుగుతుంది.
కరోనా టైమ్ లో మూతపడ్డ థియేటర్లకి కరెంటు ఛార్జీలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చినా దీని మీద జీవో మాత్రం రాలేదు. తమకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా టాక్సులు కడుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ అన్నారు. కోవిడ్ టైమ్ లో కూడా తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించామని, అలాంటిది ప్రభుత్వం ఎగ్జిబిటర్ల సమస్యపై స్పందించక పోవడం మంచిది కాదని అంటున్నారు. సినిమా థియేటర్ల మనుగడ మున్ముందు ప్రమాదకరంగానే అనిపిస్తోంది. మరో పక్క సినీ నిర్మాతలకూ, ఎగ్జిబిటర్లకూ మధ్య సఖ్యత కూడా కనిపించడం లేదు. ఓటీటీ లాంటి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా కనిపించడంతో నిర్మాతలు కొంతవరకు సేఫ్ జోన్ లో ఉన్నారు.
-హేమసుందర్ పామర్తి
Also Read ;- సినిమా మాయా బజార్ లో మోషన్ క్యాప్చర్ మాయాజాలం











