2020ని ఓటీటీ నామ సంవత్సరంగా చెప్పాల్సి ఉంటుందేమో. కరోనా థియేటర్ల పాలిట శాపంగా పరిణమిస్తే ఓటీటీలకు మాత్రం వరంగా మారిందని చెప్పాలి. చాలా సంస్థలు దీన్ని సువర్ణ అవకాశంగా భావించాయి. అనేక ఓటీటీ సంస్థలకు కాసులు కురిపించిన సంవత్సరం ఇది. మరి ఈ 2020లో టాప్ ఓటీటీ సంస్థలేమిటో చూద్దాం. వీటి మధ్య పోటీ కూడా హోరాహోరీగా సాగింది. భవిష్యత్తులో ఈ బుల్లితెరకు మంచి ఆదరణ ఉంటుందని భావించిన నిర్మాతలు, హీరోలు కూడా వీటి దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. ముఖ్యంగా వెబ్ సిరీస్ నిర్మాణం వైపు దృష్టిసారించారు. వీటిలో టాప్ 5 స్థానాల్లో నిలిచిన ఓటీటీ సంస్థల గురించి తెలుసుకుందాం.
ఓటీటీల్లో అంతర్జాతీయ సంస్థలు భారీగానే లాభాలు సంపాదించాయి. దాంతో ఈ వ్యాపారాన్ని విస్తరించే దిశగానూ అడుగులు వేశాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆపిల్ టీవీ ప్లస్ లాంటి సంస్థలు అంతర్జాతీయంగా మంచి పట్టు సాధించాయి. ఆల్ట్ బాలాజీ, సోనీ ఎల్ఐవీ, జీ 5, ఎమెక్స్ ప్లేయర్ లాంటివి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. వీటితో పాటు ఆహా, హోయ్ చోయ్ లాంటి ప్రాంతీయ ఓటీటీ వేదికలు ఆయా రాష్ట్రాల్లో జనంలోకి దూసుకెళ్లాయి. వీటన్నిటో టాప్ 5 ఓటీటీలు ఏమిటో చూద్దాం.
అగ్రస్థానంలో నెట్‌ఫ్లిక్స్
ప్రపంచ స్థాయి కంటెంట్‌ను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే విషమంలో నెట్‌ఫ్లిక్స్ ఇతర సంస్థలను మించిపోయింది. సినిమాలు లేదా వెబ్ సిరీస్ లలో నెట్‌ఫ్లిక్స్ హవా మామూలుగా లేదు. అంతర్జాతీయ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని కంటెంట్ అందించి ముందుకు దూసుకు వెళ్లింది. భారీ కంటెంట్ లైబ్రరీ నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేకత. ఇందులో ఇండియన్ కంటెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్, గిల్టీ, లూడో, ఎ సూటిబుల్ బాయ్, రాత్ అకేలి హై లాంటి హిందీ సినిమాలను అందించింది.
అలాగని ప్రాంతీయ సినిమాలను కూడా విస్మరించలేదు. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ అందించిన వాటిలో ‘ది ట్రయల్ ఆఫ్ చికాగో 7’, ‘ఐ యామ్ థింకింగ్ ఆఫ్ ఎండింగ్ థింగ్స్’, ‘ది డెవిల్ ఆల్ ది టైమ్’, ‘ది ఓల్డ్ గార్డ్’, ‘ఓవర్ ది మూన్’, ‘ది హాంటింగ్ ఆఫ్ బ్లై మనోర్ ‘,’ ది క్వీన్స్ గాంబిట్ ‘,’ డార్క్ ‘సీజన్ 3,’ మనీ హీస్ట్ ‘సీజన్ 4 లాంటివెన్నో ఉన్నాయి. ఇలాంటి కంటెంట్ ఉన్నప్పుడు అన్నిటికన్నా ముందంజలో ఉండటంలో ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇండియన్ కంటెంట్ మీద అమెజాన్ ప్రైమ్ వీడియో బాగానే దృష్టి పెట్టింది. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘గులాబో సీతావో’ ను కొనుగోలు చేసి విడుదల చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోని కంటెంట్ ను పరిశీలిస్తే భారతీయుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళుతున్నట్టు అనిపించింది. ప్రాంతీయ కంటెంట్ విషయంలోనూ తీసికట్టుగా ఏమీ లేదు. ఇ:తకుముందెప్పుడూ లేనివిధంగా ప్రాంతీయ కంటెంను అందించింది. వెబ్ సిరీస్, సినిమాల విషయంలో మంచి కథలను ఎంచుకుని మరీ ముందడుగు వేస్తోంది. ‘ట్రూప్ జీరో’, ‘బోరాట్ ‘అంకుల్ ఫ్రాంక్’, ‘చలాంగ్’, ‘సూరారై పొట్రూ’, ‘ది బాయ్స్ సీజన్ 2,’ పాతాళ్ లోక్ ‘,’ మీర్జాపూర్ ‘సీజన్ 2,’ బండిష్ బందిపోట్లు ‘ లాంటివెన్నో మచ్చుకు చెప్పుకోవచ్చు.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ప్రాజెక్టులపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ ను టార్గెట్ చేసుకుని దాన్ని అధిగమించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందుకే మార్వెల్ లాంటి సంస్థలతోనే ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యంగా హాలీవుడ్ కు సంబంధించి పెద్ద ప్రాజెక్టులు చేపట్టింది. బాలీవుడ్ కు సంబంధించి ఏడు పెద్ద ప్రాజెక్టులను కొనుగోలు చేసింది. సుస్మితాసేన్ నటించిన క్రైమ్-థ్రిల్లర్ సిరీస్ ‘ఆర్య’, బ్రాడ్‌వే మ్యూజికల్ ‘హామిల్టన్’ లతో సంచలనం సృష్టించింది, ప్రాంతీయ సినిమాల విషయానికి వస్తే ‘మూకుతి అమ్మన్’ లాంటి వాటని కొనుగోలు చేసింది. త్వరలో తన మార్కెట్ ను మరింత విస్తరించే దిశగానూ అడుగులు వేస్తోంది.
దూసుకొస్తున్న సోనీ లైవ్
సోనిలైవ్ స్పోర్ట్స్ అందరికీ తెలిసిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్. అయితే ఇటీవల ఇది గ్లోబల్, లోకల్ షోలు, సినిమాల స్ట్రీమింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. సోనీలైవ్‌లోని అంతర్జాతీయ కంటెంట్‌లో మనకు ‘ది కామన్స్’, ‘డార్క్ వాటర్స్’, ‘గ్రీన్ బుక్’, ‘1917’, ‘ఎ కన్ఫెషన్’ లాంటి చిత్రాలున్నాయి. ‘స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ’ లాంటివి ముఖ్యమైనవి. ఇవి కాక ‘యువర్ హానర్’, ‘అవ్రోద్: ది సీజ్ విత్న్’, ‘ఉందేకి’, ‘ఎ సింపుల్ మర్డర్’, ‘శ్రీకాంత్ బషీర్’, మనోజ్ బాజ్‌పేయి నటించిన ‘భోంస్లే’, ‘కడఖ్’, ‘రామ్’ సింగ్ చార్లీ ‘ లాంటివి కూడా ఆకట్టుకున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు తన సరికొత్త ఒరిజినల్ షో ‘అన్ కామన్ సెన్స్ విత్ సలోని’ లాంటి కామెడీ షోతోనూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.
‘ఆహా’ అనిపిస్తున్న ప్రాంతీయ ఓటీటీ
ప్రాంతీయ ప్లాట్‌ఫామ్‌లలో ఆహా ఆధిపత్యం తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతోంది. 2020లో తెలుగులో ఆహా దే అగ్రస్థానంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతర భాషల చిత్రాలను తెలుగులోకి అనువదించి అందించడంతోపాటు పలు తెలుగు చిత్రాలను నేరుగా విడుదల చేయగలిగింది. అల్లు అరవింద్ దూరదృష్టికి ఇది నిదర్శనం. ముఖ్యంగా ఇది నూటికి నూరు శాతం తెలుగు వెబ్ సిరీస్, సినిమాలు, పిల్లల కంటెంట్‌ను అందించింది.
‘కొత్త పోరడు’, ‘మస్తిస్’, ‘అద్దం’, ‘భానుమతి & రామకృష్ణ’, ‘జోహార్’, ‘ఒరే బుజ్జిగా’, ‘కలర్ ఫోటో’ లాంటివెన్నో ఉన్నాయి. ఆహా వీడియోలో జార్జియో హోస్ట్ చేసిన ప్రత్యేకమైన సెలబ్రిటీ చాట్ షో కూడా ఉంది. కరోనా వేవ్ తగ్గిపోతే ఓటీటీ ప్రాధాన్యం కొంత తగ్గే అవకాశం ఉన్నా కేవలం ఓటీటీ కోసమే కొన్ని ప్రాజెక్టులు రూపొందుతుండటంతో ఆ లోటును ఏదో ఒక విధంగా భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.











