రామాయణం, మహాభారంతం లాంటి ఇతిహాసాలతోనే ఒకప్పుడు సినిమాలు పుట్టుకొచ్చాయి. ఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా కేవలం కెమెరా టెక్నిక్కులతోనే వాహ్వా అనిపించేలా సినిమాలు తీశారు. హాలీవుడ్ లో స్టీవెన్ స్పీల్ బర్గ్ మాదిరిగానే మన తెలుగు దర్శకులు బి. విఠలాచార్య, కె.వి. రెడ్డి లాంటి అగ్రదర్శకులు అబ్బురపరిచేలా సినిమాలు రూపొందించారు.
ఇప్పుడంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ యుగం. ఇది అనేక కొత్త పుంతలు తొక్కి మోషన్ క్యాప్చర్ విధానం దగ్గర ఆగింది. ఆర్టిఫియల్ ఇంటిలిజెన్స్ వచ్చాక దీని పయనం ఇంకెక్కడి వరకు సాగుతుందో చెప్పలేం. రామాయణం కథాంశంతో ‘ఆదిపురుష్’ పేరుతో ఓ సినిమా వస్తుందని తెలిసినపుడు ఎన్ని సార్లు రామాయణం చూస్తాం.. అంతా తెలిసిన కథే కదా అని జనం అనుకుని ఉండవచ్చు. హీరోలకు రిస్క్ తక్కువా, నిర్మాతలకు ఖర్చు ఎక్కువ అయ్యే విధానమే మోషన్ క్యాప్చర్ అనాల్సి ఉంటుంది. రామాయణాన్ని కళ్లకు కట్టేలా తీయాలంటే ఈ విధానమే మేలు అని దర్శకుడు ఓం రౌత్ భావించి ఉండవచ్చు.
హాలీవుడ్ టు టాలీవుడ్
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ మీద ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు వచ్చాయి. అసలు మోషన్ క్యాప్చర్ అంటే ఏమిటి? అనే ప్రశ్న ఉదయించకమానదు. హాలీవుడ్ లో అవతార్, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, టిన్ టిన్ లాంటి చిత్రాలు మోషన్ క్యాప్చర్ తో తెరకెక్కినవే. అవతార్ కోసం న్యూక్ అనే కొత్త సాఫ్ట్ వేర్ ను వాడినట్లు అప్పట్లోనే వార్తలొచ్చాయి. ఈ సబ్జక్ట్ లోకి వెళితే అదో మహాసముద్రం అనే చెప్పాలి. దక్షిణాదిలో మోషన్ క్యాప్చర్ విధానాన్ని పరిచయం చేసిన దర్శకుడు శంకర్ అనే చెప్పాలి.
![]()
జీన్స్ సినిమాలో ఐశ్వర్యా రాయ్ మీద పాటను ఈ తరహాలోనే చిత్రీకరించారు. సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా మోషన్ క్యాప్చర్ విధానంలోనే ‘కొచ్చాడియాన్’ చేశారు. కానీ ఆ సినిమా ఆడలేదు. ఇప్పుడు ప్రభాస్ ‘ఆదిపురుష్’ అలానే చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనా ముంబైలో దీని షూటింగ్ కోసం వేసిన సెట్ అగ్ని ప్రమాదానికి గురవడంతో షూటింగ్ వాయిదా పడింది. దాంతో ప్రభాస్ ఆ డేట్లను ‘సలార్’ కోసం కేటాయించారు.
మోషన్ క్యాప్చర్ అంటే ఏమిటి?
మోషన్ క్యాప్చర్ ను మో క్యాప్, మోకాప్ అని కూడా పిలుస్తుంటారు. వస్తువులు, వక్యుల కదలికలను క్యాప్చర్ చేసే ప్రక్రియ ఇది. అనేక రంగాల్లో ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. క్రీడారంగం, మెడికల్, వినోద రంగం, గేమింగ్ తదితర రంగాల్లో దీని ప్రాధాన్యం బాగా పెరిగింది. టూ డీ, త్రీడీ యానిమేషన్ ప్రక్రియలో డిజిటల్ పాత్రలను తయారుచేసి వాటిని నిజ పాత్రల కదలికలకు అనుసంధానం చేస్తారు.

అనేక కెమెరాల అవసరం కూడా దీనికి ఉంటుంది. అనేక మంది నటుల కదలికలను ఈ విధానంలో చిత్రీకరిస్తారు. ఎంతమంది నటులు ఉంటారో అందిరికీ డిజిటల్ రూపాలు తప్పనిసరి. ఈ యానిమేషన్ డేటా అంతా త్రీడీలోనే ఉంటుంది. ఆ డిజిటల్ రూపమే సినిమాలో నటుడిగా కనిపిస్తుంది. ఇది నటులకు రిస్క్ లేకుండా ఉంటుంది కానీ సహజత్వానికి మాత్రం దూరంగానే ఉంటుంది అని చెప్పాలి.
సాంకేతిక మార్పులు ఎన్నో
ఈ విధానం కాలానుగుణంగా ఎన్నో మార్పులకు గురైంది. ఇప్పుడంతా ఆధునిక యుగం. 1978లో రాల్ఫ్ బక్షి ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ఆ తర్వాత వచ్చిన ‘అమెరికన్ పాప్ ’ చిత్రాలలో కనిపించిందంతా పాత పద్దతే. ఓ నటుడి నటనను చిత్రీకరించడం, దాన్ని యానిమేషన్ టేబుల్ ఫ్రేమ్ తర్వాత ఫ్రేమ్ ను చేర్చి ప్రదర్శిస్తారు. యేనిమేటర్లు తాము సేకరించిన లైవ్ యాక్షన్ ఫుటేజీకి ఆ నటుడి రూపురేఖలతో రూపొందించిన డిజిటల్ రూపురేఖలను జత చేస్తారు. కాలక్రామేణా ఈ ప్రక్రియనే ఇంకా ఆధునికీకరించారు. కెమెరా కదలికలతో మోషన్ క్యాప్చర్ చేస్తారు.
తద్వారా సన్నివేశంలోని వర్చువల్ కెమెరా ఆ నటుడు పాత్రను పోషిస్తున్నప్పుడు కెమెరా ఆపరేటర్ చిత్రీకరించే ప్రాంతం చుట్టూ పాన్, టిల్ట్ లేదా డాలీ అవుతుంది. అదే సమయంలో మోషన్ క్యాప్చర్ సిస్టమ్ కెమెరా, ప్రాప్స్‌తో పాటు నటుడి నటనను కూడా బంధిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది కంప్యూటర్-సృష్టించే మాయాజాలం. చిత్రీకరించిన ఫుటేజ్ నుంచి కెమెరా కదలిక డేటాను మళ్లీ పొందడాన్ని మ్యాచ్ మూవింగ్ లేదా కెమెరా ట్రాకింగ్ అంటారు. 1999లో వచ్చిన ది ఫాంటమ్ మెనెస్ లో ఓ పాత్ర మొత్తం ఇలా రూపొందించిందే. అలాగే ఆ తర్వాత సింద్ బాద్ చిత్రం కూడా ఈ తరహాలోనే రూపొందింది.

అవార్డులకు అర్హం కావా?
ఇలా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన సినిమాలకు దేనికీ ఇంతవరకూ ఆస్కార్ అవార్డు దక్కలేదు. సైన్స్ ఫిక్షన్ సినిమాలన్నీ దాదాపు ఈ టెక్నాలజీతోనే తెరకెక్కాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ కీ, మోషన్ క్యాప్చర్ విధానానికీ తేడా ఉందనే విషయాన్ని గుర్తించాలి. చాలా సినిమాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటోంది. మోగ్లీ: లెజెండ్ ఆఫ్ ది జంగిల్, ది జంగిల్ బుక్ చిత్రాలు మోషన్ క్యాప్చర్ విధానంలో రూపొందాయి. 1970లో ప్రారంభమైన ఈ విధానం నేడు ఎంతో అభివృద్ధి చెందింది.
![]()
ఆస్కార్ అకాడమీ మనసు మార్చుకుంటే ఈ తరహాలో తెరకెక్కిన చిత్రాలకు అవార్డులు రావడం ఎంతో సేపు పట్టదు. మున్ముందు రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలతో రూపొందే చిత్రాలు ఈ మోషన్ క్యాప్చర్ లో మరిన్ని వచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కొత్త సీసాలో పాత సారా లాంటిదన్న మాట. కథల కొరత అనే మాట ఇక వినపడకపోవచ్చు. మున్ముందు ఫాంటసీ ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరించే ప్రయత్నాన్ని ఈ మోషన్ క్యాప్చర్ విధానం చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.











