( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పేరోషన్ పరిధిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్ గురువారం రోడ్ షో నిర్వహించారు. లోకేష్ పర్యటనతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు కాశీ విశ్వనాథ్ బుధవారం వైఎస్సార్సీపీలో చేరడంతో టీడీపీ క్యాడర్‌లో ఒకింత ఆందోళన కనిపించింది. అయితే లోకేష్ పర్యటనతో టీడీపీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఎవరి కొంప కూలుస్తారో అన్న భయం
గాజువాకలో నిర్వహించిన రోడ్ షోలో లోకేష్ మాట్లాడుతూ ఆదివారం వస్తే ప్రశాంత విశాఖలో ఎవరి కొంప కూలుస్తారో అన్న భయం మొదలైందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో విశాఖ ఎంతో ప్రశాంతంగా అభివృద్ధి పథంలో దూసుకు పోయిందని, ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి ఏదో ఒక కార్యక్రమం ప్రారంభోత్సవం చేసేవారని, ఈ రెండేళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో ఆలోచించుకోవాలని ఓటర్లకు సూచించారు. విశాఖ అంటే స్టీల్ ప్లాంట్ అని, అటువంటి పరిశ్రమను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే, ఎందరో ఉద్యోగాలు ఊడిపోతాయని అన్నారు. ఎన్నికల హామీల లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు రూ.21 వేల వేతనం, పేదల నీటి పన్ను మాఫీ చేసే బాధ్యత తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. “ మన విశాఖను మనమే కాపాడుకోవాలి” అని పిలుపునిచ్చారు. ప్రశాంత విశాఖలో A2 గా వచ్చిన వ్యక్తి భూదందాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. విశాఖలో విధ్వంసాలు మొదలయ్యాయని అన్నారు. అటువంటి వారికి పదో తారీఖున పోలింగ్ రోజు ఓటును సైకిల్ గుర్తుపై వేసి బుద్ధి చెప్పాలని కోరారు. ఒక చేత్తో వంద రూపాయలు ఇచ్చి మరో చేతితో వెయ్యి రూపాయలు దోచుకుంటున్న ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే త్వరలో పీల్చే గాలి పైన పన్ను వేస్తారేమో అన్న భయం వేస్తోందన్నారు.
Must Read ;- విశాఖ మేయర్ బరి.. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తులు
శ్రీ వరాహ లక్ష్మినరసింహా స్వామి వారికి పూజలు
విశాఖ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహా స్వామి వారిని దర్శించుకుని ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గాజువాకలో నిర్వహించిన రోడ్ షోలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.అనంతరం గాజువాకలో నిరుద్యోగ యువత, విద్యార్ధులతో సమావేశం అయ్యారు.
మధ్యాహ్నం సరస్వతి పార్క్ సమీపంలో ఆటోడ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి భీమిలి, తగరపు వలసలలో జరిగే రోడ్ షోల్లో పాల్గొంటారు. సాయంత్రం 06.30 గంటలకు అనకాపల్లిలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు.
Also Read ;- జగ్గూ గ్యాంగ్‌ది ఛీప్ మెంటాలిటీ.. నారా లోకేష్