టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో అర్థంగావడం లేదు. ఈ కేసు అంతా మూడు ముక్కలాట తంతులా ఉంది. ఈ కేసులో తాజాగా ఆర్.ఎక్స్. 100 నిర్మాత అశోక్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇందులో ఇంకా ఎందరు బయటికి వస్తారో తెలియదు. శ్రావణి అనుమానాస్పద మృతి అనేక మలుపులు తిరుగుతోంది. నిన్నటి దాకా టిక్ టాక్ లు చేసే దేవరాజ్ చుట్టూ ఈ కేసు తిరిగింది.
శ్రావణితో అతని కాల్ రికార్డులు కూడా వైరల్ అయ్యాయి. తనకు ఏమాత్రం సంబంధం లేదని, శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి అనే మరో యువకుడు దీనికి కారణమని దేవరాజ్ నిన్నటి దాకా ఆరోపించాడు. ప్రస్తుతం ఆమె చావుకు అశోక్ రెడ్డి పాత్ర కూడా ఉందని దేవరాజ్ ఆరోపిస్తున్నాడు. కానీ నిర్మాత అశోక్ రెడ్డి మాత్రం ఈ కేసులో ఇప్పటిదాకా నోరు విప్పలేదు. దేవరాజ్ ఆరోపణలను సాయి తిప్పికొడుతున్నాడు. తనపై దేవరాజ్ విడుదల చేసిన వీడియో కూడా బూటకమని అతను పేర్కొన్నాడు.
నిర్మాత అశోక్ రెడ్డి క్రెడిట్ కార్డులను శ్రావణి వాడుతుంటుందనేది దేవరాజ్ చేసిన మరో ఆరోపణ. ఈ విషయంలో అశోక్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదన్నది ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఈ కేసులో అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. అసలు ఈ సాయి ఎవరు? శ్రావణికీ నిర్మాత అశోక్ రెడ్డికీ ఉన్న సంబంధం ఎలాంటిది? దేవరాజ్ – శ్రావణిల మధ్య ప్రేమ ఉన్నట్లయితే ఇద్దరి మధ్యా దూరం ఎందుకు పెరిగింది? వీరిందరి మధ్యా ఈ ఆర్థిక సంబంధాల మాటేమిటి? తదితర విషయాలన్నీ పోలీసు దర్యాప్తులో వెలుగు చూడాల్సిందే.