ఎన్టీఆర్ జీవితాన్ని తెలంగాణ పాఠ్యాంశంలో చేర్చటం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు నందమూరి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఈ విషయం తెలిసి తమ కుటుంబం ఎంతో సంతోషపడిందని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ తెలిపారు. ‘మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, వారి క్యాబినెట్ కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా తండ్రిగారైన నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను తెలంగాణ రాష్ట్ర పాఠశాల సిలబస్ లో చేర్చటం మాకు చాలా సంతోషం కలిగించింది.
మేమే కాదు… యావత్ ప్రపంచంలెపి తెలుగు ప్రజలంతా ఈ వార్త తెలుసుకుని ఎంతో సంతోషించారు. అంతటి మహనీయుని జీవిత చరిత్రను తెలంగాణ పాఠశాల సిలబస్ లో చేర్చి విద్యార్థులకు పాఠ్యాంశం చేయటం భావితరాలకు తప్పకుండా మార్గ దర్శకం అవుతుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిలో ఉన్న నీతి, నిజాయితీ, కృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధత… ఇవన్నీ భావి తరాల విద్యార్థులకు ఒక ఊపిరిగా, స్ఫూర్తిగా తీసుకొని పాటిస్తే భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తయారవుతారని భావిస్తున్నాం’ అంటూ రామకృష్ణ తన ప్రకటనలో పేర్కొన్నారు.











