జనసేన నేత, థర్జీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన వార్తల్లొకెక్కారు. సోషల్‌మీడియా ఎక్స్ (ట్విట్టర్)లోకి ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ..రావడం,రావడమే హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల జరిగిన లైలా మూవీ వివాదం మరిచిపోకముందే…తాజాగా పృథ్వీ చేసిన మరో ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. నేను నా భావాలను స్టేజ్‌పై ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఇక నుంచి X (ట్విట్టర్) వేదికను ఉపయోగించుకుని భావ ప్రకటన స్వేచ్ఛను తెలియపరుస్తాను..థాంక్యూ అంటూ మొదటి ట్వీట్ చేశారు పృథ్వీ.
పృథ్వీ చేసిన మరో ట్వీట్ ఇప్పుడు చర్చకు దారి తీసింది. రోజుకు 11 సార్లు నీళ్లు తాగండి.. అసలే ఎండాకాలం అంటూ పృథ్వీ ట్వీట్ చేశారు. వేడి 151 డిగ్రీల ఫారెన్ హీట్‌కి రీచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి..నా తోటి సోదరుల కోసం ఆరోగ్య చిట్కాలు అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. వైసీపీ శ్రేణులను ట్రిగ్గర్ చేస్తోంది. 11 నెంబర్ అంటే చాలు వైసీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలకు నిద్రలేకుండా పోతుంది.
ఇటీవల లైలా సినిమా ఈవెంట్‌లోనూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. లైలా ఈవెంట్‌లో మాట్లాడిన పృథ్వీ..సినిమాలో తాను మేకల సత్తిగా నటించానని, ఓ సీన్‌లో మేకలు ఎన్ని ఉన్నాయ్ రా అని అడిగితే 150 ఉన్నాయని చెప్పానంటాడు. కానీ సినిమా ముగిసే సరికి 11 మేకలే మిగిలాయంటూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు కొద్దిరోజుల క్రితం వివాదానికి దారి తీశాయి. వైసీపీని ఉద్దేశించే పృథ్వీ ఈ వ్యాఖ్యలు చేశారని..ఆ పార్టీ కార్యకర్తలు బ్యాన్ లైలా అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు. ఐతే సినిమాలోనూ పెద్దగా స్టోరీ లేకపోవడంతో పెద్దగా ఆడలేదు.
2019 ఎన్నికలకు ముందు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు పృథ్వీ. ఆ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. దీంతో పృథ్వీకి SVBC భక్తి ఛానల్ ఛైర్మన్ పదవి కూడా దక్కింది. ఐతే పృథ్వీ వ్యవహార శైలిపై విమర్శలు రావడంతో వైసీపీ పక్కన పెట్టింది. ఐతే తనపై వైసీపీ నేతలే కుట్ర చేసి పక్కకు తప్పించారని అప్పట్లో పృథ్వీ ఆరోపించారు. తర్వాత వైసీపీకి దూరం జరిగారు. ఇప్పుడు జనసేనలో చేరిన పృథ్వీ..వీలు చిక్కినప్పుడల్లా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు.











