గ్రేటర్‌లో చెరువుల ఆపరేషన్ మొదలైంది. చెరువుల విస్తీర్ణం.. కబ్జాలపై ప్రభుత్వం కన్నెర్రజేస్తున్నది. పాతబస్తీ అతాలకుతలం కావడం వెనక కారణాలను ఆరా తీస్తున్నారు. చెరువుల కబ్జాలను ప్రోత్సహించిన నేతలపై సర్కారు ఏం చేయబోతున్నది? పాతబస్తీ నేతలు ఏమనుకుంటున్నారన్న విషయం వెలికి తీసే పనిలో పడింది ప్రభుత్వం.
పాతబస్తీ పూర్తిగా అతలాకుతలం కావడానికి ప్రధాన కారణం రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పల్లెచెరువు గండిపడటమే. ఈ చెరువు పైభాగంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ప్రోత్సాహంతోనే లే అవుట్ ఏర్పాటు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు.. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఫిర్యాదు కూడా చేశారట. పల్లె చెరువు గండిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కూడా తెప్పించుకుంది.
మరికొన్ని ప్రాంతాల్లో స్థానిక నేతలు చెరువుల్లోకి నీరు రాకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పటేల్ చెరువులోకి ఒక్క చుక్క నీరు రాలేదు. చెరువు పైభాగంలో నిర్మించిన నిర్మాణాలకు ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ.. చెరువులోకి నీరు రానివ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. మంత్రి కేటీఆర్ దృష్టికి స్థానికులు ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు సమాచారం.
చెరువుల కబ్జాలు నేతల మెడకు ఉచ్చులా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం చెరువుల ఇష్యూని సీరియస్‌గా తీసుకుంటుంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పక్కా ప్రణాళికతోవెళ్లాలని భావిస్తోంది. ఫ్లైఓవర్లతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తుంటే.. చెరువుల కబ్జాలతో ప్రభుత్వ ప్రతిష్టని దిగజార్చిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.











