(ఒంగోలు నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
టీడీపీ హయాంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సంక్షోభంలో కూరుకుపోయింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రకాశం జిల్లా. ఇప్పటికే డబ్బులు కట్టి, లాటరీలో పేర్లు వచ్చి, అద్దె ఇళ్లలో కాలం గడుపుతున్న సుమారు 10,000 లబ్ది దారులు అసలు ఇళ్లు తమకు వస్తాయా..? లేక ఆశలు నట్టేట్లో మునిగినట్టేనా అనే సంశయంలో ఉన్నారు. పరిస్థితి ఏమిటో అర్థం కాక తల్లడిల్లిపోతున్నారు.
ఒంగోలు నియోజకవర్గం కొప్పోలు సమీపంలో టీడీపీ హయాంలో G+3 ఇళ్ల నిర్మాణం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభమైంది. 2018 డిసెంబర్ నాటికి పూర్తిచేసి లబ్దిదారులకు ఇళ్లను అందించాల్సి ఉంది. కానీ, తర్వాత రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది.
రివర్స్ టెండరింగ్‌లో ఇటీవలే కొత్త వారికి పనులు అప్పగించినా.. ఆ పనులు నత్తనడకలా సాగుతున్నాయి. దీంతో ఎప్పటికైనా సొంతిల్లు సమకూరుతుందన్న ఆశతో రెండేళ్లుగా అద్దె ఇళ్లల్లో కాలం గడుపుతున్న లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు.
మీ డబ్బులు మీకిస్తాం, ఇళ్లు కాన్సిల్ చేస్తున్నాం..!
గత ప్రభుత్వ హయాంలో లాటరీలో ఇళ్లు వచ్చిన జి ప్లస్ త్రీ లబ్దిదారులకు అధికారులు, బ్యాంకర్లు షాకులు మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే తమకు కేటాయించిన ఇంటిని ఇస్తారా..? లేక మళ్లీ గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని.., మళ్లీ లాటరీ నిర్వహించి తమకు ఇళ్లు రాకుండా చేస్తారా..? అనే భయాందోళనతో లబ్దిదారులుంటే.., కొందరికి కిస్తీలు చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి డిమాండ్ నోటీసులు అందుతున్నాయి.
అసలు ఇంత వరకూ తమకు ఇళ్లే ఇవ్వలేదు..? వాటి నిర్మాణం పూర్తవ్వలేదు.., పూర్తి అయినా తమకు ఇస్తారో..? లేదో అర్థం కావడం లేదు.., ఇప్పటికే అద్దెలు కట్టలేక అల్లాడిపోతుంటే.., బ్యాంకులకు కిస్తీలు ఎక్కడి నుంచి తెచ్చికట్టాలని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.., కొందరికి మాత్రం అధికారులు మీకు కేటాయించిన ఇంటిని రద్దు చేస్తున్నాం.., జీ ప్లస్ త్రీ ఇంటికి కట్టిన డబ్బులు వెనక్కి తిరిగి ఇస్తామని చెబుతుండడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
రాజకీయ క్రీనీడలో 9690 ఇళ్లు…!
ప్రకాశం జిల్లా ఒంగోలు, కందుకూరు, కనిగిరి, అద్దంకి, గిద్దలూరు, మార్కాపురం, చీమకుర్తి నుంచి దాదాపు 30 వేలకుపైగా ప్రజలు ఇల్లు కావాలని దరఖాస్తులు చేసుకున్నారు. మొదటి విడతలో దాదాపు 13 వేల మందికి మూడు రకాల ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. కొన్నిచోట్ల ఆన్‌లైన్ ద్వారా ప్లాట్ల నంబర్లను సైతం కేటాయించారు. ప్రభుత్వం మారిన తర్వాత వివిధ కారణాలతో నిర్మాణాలు నిలిచిపోయాయి.
చీమకుర్తిలో అయితే అసలు పనులే ప్రారంభమే కాలేదు. 3 వేలకుపైగా ఇళ్ల కేటాయింపులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఒంగోలులో 4,150, కందుకూరు 1,450 , కనిగిరి 920 , అద్దంకి 1,000 , గిద్దలూరు 1,250 , మార్కాపురం 920 మొత్తం కలిపి 9690 ఇళ్ల భవిష్యత్తు సందిగ్థంలో పడింది. ఏడాదిన్నర కాలంగా 70 శాతం వరకూ పూర్తైన భవనాల్లో కూడా పనులు నిలిపివేయడంతో.. కొన్నిచోట్ల పునాదులకు నెర్రెలు రాగా, కొన్ని ఇళ్లలో పైకప్పు పెచ్చులూడి పోతున్నాయి.
రివర్స్ దెబ్బ…!
ఏడాదిన్నర నుంచి పాడుబెట్టి.., ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అంటూ మళ్లీ ఇళ్ల నిర్మాణానికి ఇటీవలే ప్రభుత్వం ఆమోదించింది. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ చేయడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతుండటంతో.., టీడీపీ హయాంలో ప్రారంభమైన ఇళ్లు లబ్ది దారులకు అందడం అనుమానంగానే కనిపిస్తోంది.
చూడాలి.., ఇప్పటికైనా నట్టేట్లో మునిగిన లబ్దిదారుల్ని ప్రభుత్వం ఒడ్డునపడేస్తుందే.. లేక రాజకీయ క్రీనీడలో వారి సొంతింటి కలను కల్లలు చేస్తుందో అంటే వేచి చూడాల్సిందే…!











