అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిందే. ఈ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు స్టే ఎత్తివేయాలన్న దానిపై సమాధానం తెలపాలని సిట్‌కు, డీజీపీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రివర్గ ఉప సంఘం రూపొందించిన నివేదికను సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే ధర్మాసనాన్ని కోరారు. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
వాదనలు ఎలా ఉన్నాయంటే..
రాజధానిలో భూ కుంభకోణం జరిగిందని జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసిందని, దర్యాప్తు పారదర్శకంగా సాగుతున్న సమయంలో దీనిపై హైకోర్టు స్టే ఉత్తర్వులివ్వడం సరికాదని ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. కొందరు వ్యక్తులు ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులో రిట్ దాఖలు చేశారని, ఇలా చేయడం సరికాదని ఆయన వాదించారు. రిట్ వేసిన వారికి సిట్ దర్యాప్తుతో ఎలాంటి సంబంధం లేదని దువే కోర్టుకు తెలిపారు. సిట్ దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని దుష్యంత్ దవే ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని దువే కోర్టుకు తెలిపారు. అయితే, టీడీపీ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను ఈ ప్రభుత్వం సమీక్షిస్తోందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్న అంశాల్లో మాత్రమే దర్యాప్తు చేస్తున్నారని దవే సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ విషయంలో హైకోర్టుకు అసాధారణ అధికారాలు లేవని, సుప్రీం ఆదేశాలకు లోబడాల్సిందేనని దవే వెల్లడించారు. తన వాదనను బలపర్చే విధంగా పాత తీర్పులను ఉదహరించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్యకు, సిట్‌కు నోటీసులు జారీ చేసింది.