ధోనీ, లెజెండ్, కబాలి వంటి చిత్రాలతో సౌత్ ప్రేక్షకులకు దగ్గరైన నటి రాధికా ఆప్టే.ప్యాడ్‌మాన్, అంధాధున్, పార్చుడ్ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలిచే ఈ అమ్మడు, తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కింది.
ప్రస్తుతం వరుస సినిమాలతో రాధికా ఆప్టే బాలీవుడ్ లో బిజీగా ఉంది. అయితే ఈ నటి కరోనా మహమ్మారి ముందు అవకాశాలు కోల్పోయిన తీరును తెలిపింది. అంతేకాకుండా అందం కోసం సర్జరీలు చేయించుకునే నటీమణులు తనకు దక్కాల్సిన ప్రాజెక్టులను సొంతం చేసుకున్నారని ఓ ఇంటర్వ్యూలో విమర్శించింది.
కరోనా సమయంలో తాను ఎంతో నిరాశకు గురయ్యానని, తాను చేయాల్సిన ప్రాజెక్టులు ఇతరులకు వెళ్లాడమే ఇందుకు కారణమని ఆమె పేర్కొంది. సెక్సీ ఈమేజ్ కారణంగా కొంత మంది తన అవకాశాలను కొల్లగొట్టుకుపోయారని..ఈ విధంగా యువ నటులు తన ప్రాజెక్టులను పొందడంతో తాను కాస్త నిరుత్సాహానికి గురయ్యానని రాధికా చెప్పుకొచ్చింది.
సినిమా ఇండస్ట్రీలో అందంగా కనిపించడానికి సర్జరీలు చేసుకోవడం మామూలేనని.. అనేకమంది హీరోయిన్ లు, నటీనటులు అందంగా కనిపించడానికి అలాంటి చికిత్సలు చేయించుకున్నారని తెలిపింది. అయితే తనకి మాత్రం ఇలాంటివి ఇష్టం ఉండదని, సహజంగానే ముసలితనం రావాలని కోరుకుంటున్నట్లు రాధికా వెల్లడించింది. వయస్సును తగ్గించుకోవడానికి పరిశ్రమలోని కొందరు వ్యక్తులు శస్త్రచికిత్సలు చేయించుకోవడం చూశానని.. తనతో కలిసి పనిచేసే వారిలో చాలామంది తమ ముఖాలను, శరీరాలను అందంగా మార్చుకోవడానికి పలు రకాల శస్త్రచికిత్సలు చేయించుకున్నారని చెప్పుకొచ్చింది. బయట బాడీ పాజిటివిటీ గురించి ఎక్కువగా మాట్లాడే వారే స్వయంగా సర్జరీలు చేయించుకుంటున్నారన్న రాధికా, అలాంటి వారితోనే కెరీర్ పరంగా తనకు సవాలు ఎదురవుతోందని తెలిపింది.
మరి ఇప్పటికైనా రాధికాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు లభిస్తాయా అనేది వేచి చూడాల్సిందే..