ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయ పరంగా ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తాము అనుసరిస్తున్న సంక్షేమ పధకాలు, సామాజిక న్యాయం వచ్చే ఎన్నికల్లో తమకు విజయం చేకూరుస్తాయి అని అధికార పక్షం, అన్ని వర్గాల్లో పెల్లుబుకుతున్న ప్రభుత్వ వ్యతిరేకత తమకు విజయం చేకూరుస్తుందని ప్రతిపక్షం, అసలు తాము సంక్షేమం గా ఉన్నామో అభివృద్ధి వైపు అడుగేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో ప్రజలు, ప్రతి రోజూ రాజకీయ విమర్శలు, చర్చలు , చర్యలు ప్రతీకార చర్యలు తప్ప భవిష్యత్తు గురించి ఎవరూ మాట్లాడటం లేదని నిరాశలో యువత. ఇదీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. మూడు సంవత్సరాల పరిపాలన అనంతరం కొంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది సాధారణం. ఇందుకు ఇటీవల కొన్ని దశాబ్దాల నుండి అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న విపరీతమైన సంక్షేమ పధకాల విధానం ప్రధాన కారణం. సంక్షేమం అవసరమే. కానీ పరిమితికి మించి సాగించే సంక్షేమ పధకాల వల్ల దీర్ఘకాలంలో కేవలం ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటమే కాక ప్రజల్లో అసంతృప్తి ఎక్కువై వివిధ వర్గాల మధ్య అంతరాలు పెరిగి సామాజిక అసమతౌల్యానికి దారితీస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చే పరిస్థితి లో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ లేదు. అటువంటప్పుడు సహజంగానే ప్రభుత్వం పై అసంతృప్తి ఏర్పడటం సహజం. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసంతృప్తి కి వ్యతిరేకతకు ఉన్న తేడా. ఇటీవలి కాలంలో అనేక వర్గాల ప్రజలు ప్రభుత్వం పై అసంతృప్తి తో రోడ్ల పైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయటం చూస్తున్నాం. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేక మీడియా దానిని ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం గా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంది. అంత మాత్రాన ప్రజలంతా ప్రభుత్వంపై వ్యతిరేకత తో ఉన్నారని భావించటం పొరబాటు. ఎక్కువ మంది అసంతృప్తి తో ఉన్నా ఎన్నికల నాటికి ఆ అసంతృప్తి ని చల్లార్చి తిరిగి వారిని సానుకూలంగా మార్చుకునే అవకాశం అధికార పార్టీకి ఉంది. అలాగే ఈ అసంతృప్తి ని వ్యతిరేకత గా మార్చి తాము అధికారం లోకి రా గల అవకాశం ప్రతిపక్షానికీ ఉంది. ఆ యా అవకాశాలను ఉపయోగించుకుని సరైన ప్రణాళికతో కష్ట పడిన వారికి రాబోయే ఎన్నికల్లో విజయం లభిస్తుంది.
ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమం తెలుగుదేశం నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపిదనటంలో సందేహం లేదు. వారు వారి కోణంలో విశ్లేషించుకుని, వై సి పి పని అయిపోయింది అని తాము అధికారంలోకి వచ్చేసినట్లే అని భావిస్తే పొరబాటు. మహానాడు కార్యక్రమం కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా సరిగా నిర్వహించే పరిస్థితి లేదు. కరోనా తర్వాత జరిగిన మహానాడు కనుక సహజంగానే ఎక్కువ మంది మహానాడు కొరకు ఉత్సాహంతో వచ్చారు. అదే సమయంలో వివిధ వర్గాల్లో ప్రభుత్వం పై ఉన్న అసంతృప్తి వల్ల ఇంకా ఎక్కువ మంది హాజరై ఉండవచ్చు. కానీ ఒక్కసారి విశ్లేషించి చూస్తే, తెలుగుదేశం పార్టీ తమ కుటుంబం గా భావించే పార్టీ సభ్యులు 60, 70 లక్షల మందిలో వచ్చిన వారు 3 లక్షలు. అంటే 5 శాతం. అలాగే వచ్చిన వారిలో ఏ యే వర్గాల వారు ఎంతమంది? సహజంగా పార్టీ కార్యకర్తలు,అభిమానులు కాక అదనంగా వచ్చిన వారు ఎందరు? సంక్షేమ పధకాలు అందుకుంటున్న వారు ఎందరు? సాధారణంగా అసంతృప్తులు బయటకు వచ్చి నిరసనలు తెలియజేస్తారు. కానీ ప్రభుత్వంపై సానుకూలత తో ఉన్నవారు బయటకు కనపడరు కదా. మరి వారిని విస్మరిస్తే ఎలా. అలాగే తెలుగుదేశం పార్టీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. గత ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన పసుపు కుంకుమ పధకం పరాజయాన్ని ఆపగలిగిందా? అనేక చోట్ల మాకు ఈ MLA వద్దు కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అన్న ఆలోచనతో తెలుగుదేశం కార్యకర్తలు పని చేయటం జరిగింది. అంటే స్థానిక నాయకులపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇప్పటికైనా ఆ విషయంలో లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నాలు జరిగాయా? ఈ మధ్య కాలంలో పార్టీ కార్యక్రమాలకు పెరుగుతున్న జనాదరణ పార్టీ స్వంతంగా సాధించిందా లేక ప్రభుత్వం పై నెలకొన్న అసంతృప్తా?
మంచి ఆలోచించి చేసారో లేక రాజకీయ ప్రయోజనాల కోసం చేసారో కానీ గత నాలుగు సంవత్సరాలుగా వై సి పి నాయకులు సామాజిక న్యాయం పేరుతో కొన్ని వర్గాల ప్రజల్లో కొన్ని కొత్త ఆలోచనలకు తెర తీసారు. ఇన్నాళ్ళూ తాము పీడిత వర్గం గానే ఉండిపోయామనీ, ఇప్పుడే తాము తలెత్తుకుని తిరగ గల్గుతున్నామని, దీనికి జగన్మోహన్ రెడ్డి కారణమని చాలా వర్గాల వారు భావిస్తున్నారు. కొన్ని వర్గాల వారిని ఇబ్బంది పెట్టినా తమకు న్యాయం చేస్తున్నారనీ, అందుకొరకు ఎవరు ఏమన్నా అప్పులు చేసి మరీ తమకు మంచి చేస్తున్నారని ఇంకా జీవితాంతం తాము జగన్ మోహన్ రెడ్డికి విధేయులుగా ఉంటామని ఎంతోమంది భావిస్తున్నారు. ఒక స్థాయి వరకు వారి ఆలోచనలు అర్ధం చేసుకో తగినవే. అందుకు ఒక విధంగా కొంతమంది అగ్ర వర్గాల ప్రవర్తన కూడా కారణం. అలాగే వారి ఆర్ధిక పరిస్థితులు కూడా. ఏ రోజు కారోజు పని కోసం జీవనం కోసం పోరాటం చేసే వారికి అభివృద్ధి అవినీతి గురించి ఆలోచించే అవసరం సమయం ఉండవు. కానీ అదే పంధాలో ఇతర విషయాలేవీ పరిగణించకుండా ముందుకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఎంతో ప్రీతిపాత్రమైన సంక్షేమ పధకాలు భవిష్యత్తులో వారి జీవితాలనే బలికోరవచ్చు. సంక్షేమ పధకాల తోనే ప్రజలను ఆకట్టుకోవాలి అనుకునే రాజకీయ పార్టీలకు కూడా ఇది వర్తిస్తుంది. నేడు తమను గెలిపించిన ఈ పరిమితికి మించిన సంక్షేమ పధకాలే ముందు ముందు తమకు మరణశాసనాన్ని లిఖిస్తాయి. ఇందుకు ఎన్నో ఉదాహరణలు చరిత్ర లో ఉన్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా గమనించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అధికార పార్టీ చేసిన తప్పుల వల్ల ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని వ్యతిరేకత గా భావించి ఇంకా రాబోయే ఎన్నికల్లో విజయం తమదే అన్ని ధీమాలో ప్రతిపక్షం ఉండకూడదు. ఆ అసంతృప్తి ని వ్యతిరేకత గా మార్చుకునే క్రమంలో దూరమైన వర్గాలను దగ్గర చేసుకుంటూ, ఆచరణ యోగ్యమైన హామీలను ప్రకటించి సమాజంలో క్రింది వర్గాల వారికి అభివృద్ధి ఆవశ్యకతను వివరించి వారిని తమవైపు తిప్పుకో గలగాలి. ప్రభుత్వ వ్యతిరేకత మీదే ఆధారపడకుండా తమ స్వంత బలాన్ని పెంచుకోవాలి. అందుకు ఇతర పార్టీల నుండి వోటర్లు నాయకుల మద్దతు కూడగట్టాలి. అంతా మనకు అనుకూలంగా ఉంది వేరే వారి సహాయం అవసరం లేదు అన్న భరోసా మంచిది కాదు. మొన్నటి మహానాడు తరువాత తెలుగుదేశం నాయకుల్లో ఈ భావన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదం.మరీ ముఖ్యంగా స్థానిక నాయకత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పై దృష్టి పెట్టాలి. అందుకు అవసరమైతే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. భారతదేశంలో MLA గెలిస్తేనే పార్టీ గెలుస్తుంది. భావసారూప్యమున్న పార్టీలతో కలిసి వెళ్ళాలి. అందుకు కొన్ని త్యాగాలు సర్దుబాట్లు తప్పవు. బి జె పి తో పెంచుకున్న వైరం వల్ల జరిగిన నష్టం 2019 లో కనబడుతూనే ఉంది. ఇక అధికార వై సి పి పార్టీ కేవలం సంక్షేమమే కాక అభివృద్ది పై కూడా దృష్టి సారించాలి. సంక్షేమ పధకాల వల్ల ఎక్కువ శాతం ఓట్లు వస్తాయనుకున్నా, ఒక్కసారి వాటికి అంతరాయం ఏర్పడితే అంతకు పదింతలు నష్టం వాటిల్లుతుంది. పైగా అభివృద్ధి ని కోరుకునే వర్గాలు ఎలాగూ పూర్తిగా దూరమవుతారు. అప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతుంది పార్టీ పరిస్థితి. 2019 ఎన్నికల్లో వచ్చిన ప్రజాదరణ ప్రకారం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇప్పట్లో తిరిగి కోలుకోలేని పరిస్థితి. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో క్రమక్రమంగా ప్రతిపక్ష పార్టీకి పెరుగుతున్న బలం దేనికి సంకేతం? కేవలం మూడు సంవత్సరాల లోపే ఇంత అసంతృప్తి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ కూడా అధినాయకుడిపై ఉన్న ఆరాధన స్థానిక నాయకులపై లేదు. ఇది ప్రజాస్వామ్యంలో అధినేతకు ఏ విధంగా ఉపయోగం? ప్రతి విషయాన్ని కేవలం రాజకీయ కోణంలో చూడకుండా తాము సుపరిపాలన అందించగలమని సమాజంలోని అన్ని వర్గాలనూ నమ్మించ గలగాలి. లేకుంటే తామున్నది కొన్ని వర్గాల కోసమే అని మిగిలిన వారిని దూరం చేసుకుంటే రేపు తమవారనుకున్న వారు దూరమైతే పార్టీ భూస్థాపితమే. ఎందుకంటే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు.అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాలన్నీ గమనించి వచ్చే ఎన్నికలకు సిద్ధమవ్వాలి. ఇందులో ఎవరు ఎక్కువగా నిజాయితీతో కష్టపడతారో వారిదే 2024 లో విజయం వరిస్తుంది.
–గద్దె బుచ్చి తిరుపతి రావు