స్వపక్షంలో విపక్ష సభ్యుడుగా ఉంటున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోమారు ఏపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. మూడు రాజధానులపై సుప్రీంకోర్టు నిర్ణయం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. రైతుల పక్షాన న్యాయం ఉందని న్యాయస్థానాలు న్యాయం పక్షాన ఉంటాయని మరోసారి తేలిందని సంతోషాన్ని తెలియచేశారు. అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కౌలు కోసం అమరావతి రైతులు నిరసన చేపడితే వారిపై లాఠీచార్జి జరపడం దారుణమని ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కౌలుకు కూడా డబ్బులు లేని ప్రభుత్వం మూడు రాజధానుల నిర్మాణం చేపట్టడమేంటని ఆయన ఎద్దేవా చేశారు. అనవసర తొందరపాటుకు పోయి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
పిపిఈ కిట్లు లేవని ప్రభుత్వాన్ని విమర్శించినందుకు డాక్టర్ గంగాధర్ పై కేసులు పెట్టడం అన్యాయం కాదా? అని ప్రశ్నించారు. కక్ష్య సాధింపులో భాగంగానే రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న గంగాధర్ పై ఐదు నెలల అనంతరం కేసులు పెట్టారని విచారాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి జులుం ఎక్కువ రోజులు సాగదని హెచ్చరించారు. తనను వైసీపీ నాయకులు బెదిస్తున్నారని తెలిపిన ఆయన వారిని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హితవు చెప్పారు. వేధింపులకు తాళలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తాను అలాంటి రకం కాదని తేల్చేశారు. దళితులపై శిరోముండనం కేసులో పార్టీ ప్రధాన నాయకులు అనుచర గణం హస్తం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బంధుప్రీతి కి దూరంగా ఉంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి ఈ ఘటనపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
తప్పుడు సలహాలు ఇచ్చే సలహాదారులను దూరంగా పెట్టండని ఆయన జగన్ కు ఓ సలహా ఇచ్చారు. మంచి అనుభవం, వ్యక్తిత్వం ఉన్న రామచంద్రమూర్తి లాంటి వారు సలహాదారు పదవికి రాజీనామా చేయడం దురదృష్టకరమని అన్నారు. డాక్టర్ రమేష్ కుమార్ పై కేసులు పెట్టి వేధించడం బాధాకరమని ఆయన సామాజికవర్గాన్ని సూచించేలా పేరు చివరన చౌదరి అని తగిలించి వేదించడమేంటని మండిపడ్డారు. జగనన్న బూట్లు బట్టలు ఇచ్చేందుకే సెప్టెంబర్ 5వ తారీఖున బళ్ళు తీరుస్తామని ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేసిన
పేపర్లో ప్రకటన ఇచ్చి ప్రచారం చేసుకునేందుకు స్కూల్లు తెరిచి పిల్లల ప్రాణాలను పణంగా పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను ముఖ్యమంత్రికి తెలియజేసే నేను ఎందుకు రాజీనామా చేయాలి? అని జగన్ సర్కార్ కు ఆయన ఎదురు ప్రశ్న వేశారు. తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే గతం కన్నా మూడురెట్లు మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నెగ్గాను కాబట్టి మళ్లీ రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇకనైనా తన రాజీనామా డిమాండ్ చేయొద్దని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. తమ జిల్లాలో ఇన్చార్జిగా నియమించిన వ్యక్తి వల్లనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ఉన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. మూడు రాజధానుల విషయంలో ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే తమ వద్దకు ఎందుకు వచ్చారని కోర్ట్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం విదితమే.











