మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’సినిమాపై పెద్ద రాద్దాంతమే జరుగుతోంది. ఈ కథ తన కథేనని, తను బాలకృష్ణ కోసం రాసుకున్న కథ అని రాజేష్ మండూరి అనే కోడైరెక్టర్ ఆరోపిస్తున్నారు. అసలు కథేంటి? ఆ కాపీ వివరాలేంటి అనే విషయాలపై రాజేష్ ఏమంటున్నారో చూద్దాం. రాజేష్ మండూరితో ‘దిలియోన్యూస్ ’ఫోన్ లో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలివి.
ఎవరెవరో వచ్చి ‘ఆచార్య’ కథ నాదేనంటున్నారు?
ఎవరెవరో రాలేదు. నేను ఆరోపణలు చేయబోతున్నానని తెలిసి ముందుగా ఓ పేరును తెరమీదికి తెచ్చారు.
ఈ కథను మీరు ఎప్పుడు తయారుచేసుకున్నారు?
దర్శకుడవ్వాలన్నది నా ప్రయత్నం. 2016 నుంచి ఆ ప్రయత్నాల్లో ఉన్నాను. 2017లో ఈ కథను తయారుచేసుకున్నా. బి. గోపాల్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశా. ఓ రోజు మాకు బాగా తెలిసిన గోరంట్ల పేరయ్య అనే వ్యక్తి నా దగ్గరకు రావడం జరిగింది. మాది ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం. అతను మా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ దగ్గరకు వెళుతూ నన్నుకూడా తీసుకువెళ్లారు. నేను సినిమా రంగంలో ఉన్నానని తెలుసుకుని కథలేమైనా ఉన్నాయా అని ఆయన అడిగారు. నా దగ్గర ఉన్న స్టోరీ లైన్ ఒకటి చెప్పాను. తనకు బాగా నచ్చి మా బ్యానర్ మైత్రీ మూవీస్ లో చెప్పవచ్చుకదా అన్నారు. అలా అక్టోబరు 3న మైత్రీ మూవీస్ లో కథ చెప్పే అవకాశం వచ్చింది. ఆ అధినేతల్లో ఒకరైన యలమంచిలి రవికుమార్, సీఈఓ చిరంజీవి (చెర్రీ)లకు కథ చెప్పాను. రవి బ్రీఫ్ గా కథ విని బయటికి వెళ్లిపోతే ఆ తర్వాత చెర్రీకి పూర్తి కథ చెప్పాను. ఆయన తన వాయిస్ రికార్డర్ ఆన్ చేసి విన్నారు. ఇప్పుడు అదే కథ కొరటాల శివ దగ్గరికి వెళ్లిపోయింది.
మీ కథకు సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోలేదా?
రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ చేశాను. ఆ ధైర్యంతోనే చెప్పగలిగాను. కథ ఫస్ట్ హాఫ్ అవగానే తన ఫ్యామిలీ నుంచి ఫోన్ వచ్చిందని, మరుసటి రోజు విందామనడంతో అక్కడి ఆపేశాను. మరుసటి రోజున కథ చెప్పటాన్ని కొనసాగించాను. పూర్తిగా కథ విన్న చెర్రీ గారు కథ చాలా బాగుందని, నెరేషన్ కూడా బాగుందని మెచ్చుకున్నారు. చివరికి ఆయన ఓ మాటన్నారు ‘ఇది హెవీ సబ్జెక్ట్… పైగా హెవీ బడ్జెట్… కొరటాల శివ లాంటివారైతేనే దీనికి న్యాయంచేయగలరు. ఈ కథతో ఏ హీరోనైనా ఆయన ఒప్పించగలరు’ అన్నారు. ఆయన అయితేనే బిజినెస్ పరంగా వర్కవుట్ అవుతుంది… ఆయన డైరెక్ట్ చేస్తే కథ ఇస్తారా? అని కూడా అడిగారు. అలాంటి ఉద్దేశం నాకు లేదని, నేనే డైరెక్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పాను.
దానికి ఆయన ఏమన్నారు?
మీరు అర్జున్ రెడ్డి, గీతగోవిందం, ఆరెక్స్ 100 సినిమాలు చేసుకోవచ్చు కదా అన్నారు. వాళ్ల నిర్మాతతో మాట్లాడి ఏ విషయం చెబుతాననడంతో సరేనని వచ్చేశాను. అప్పటినుంచి నాకు వారి నుంచి ఎలాంటి కాల్ రాలేదు. అనుకోకుండా మా ఊరెళ్లినపుడు గొట్టిపాటి రవికుమార్ గారిని కలిశాను. కథ హెవీగా ఉందట, బడ్జెట్ కూడా హెవీగా అవుతుందట… కథ ఇవ్వనన్నావట కదా అందుకే వాళ్లు డ్రాప్ అయ్యారు అని అన్నారు.
అప్పటి నుంచి ఏంచేశారు?
డైరెక్టర్ అవ్వాలన్న నా ప్రయత్నాల్లో ఉన్నాను. ఓ స్నేహితుడి సహాయంతో చెన్నైలోని డెకాల్టి అనే తమిళ సినిమా నిర్మాత ఎస్.పి. చౌదరిగారికి కథ చెప్పటం, ఓకే అయిపోవడం జరిగింది. ఈ కథను బాలకృష్ణ గారికి చెప్పాలనే ప్రయత్నాల్లో ఉండగానే ఎన్నికలు వచ్చాయి. దాంతో ఆయనకు కథ చెప్పడం కుదరలేదు. ఈలోగా చిరంజీవిగారితో కొరటాల శివ సినిమా చేస్తున్నారని తెలిసింది. కొంతమంది మిత్రుల ద్వారా అది నా కథేనని తెలసి షాక్ అయ్యాను. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన భాస్కర్ రెడ్డి సలహా మేరకు కొరటాల శివ కోడైరెక్టర్ అయిన చలసాని రామారావు గారికి ఫోన్ చేసి కొరటాల గారిని కలవాలనుకుంటున్నట్టు చెప్పాను. నన్ను కలవడానికి కొరటాల ఇష్టపడటం లేదని కొరటాల అన్నట్టు ఆయన చెప్పారు. కలవాల్సిన అవసరం లేదని కూడా కొరటాల అన్నారట. నేను పదేపదే కోరడంతో నా స్టోరీ లైన్ ఏమిటని అడిగారు. నేను చెప్పింది విన్నాక ఇద్దరిదీ ఒకటే లైన్ అని కూడా అన్నారు.
చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు?
మా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్, కార్యదర్శి జి.రామ్ ప్రసాద్ లను కలిసి విషయం వివరించాను. కొరటాల శివతో తను మాట్లాడానని, ఆయన వేరే వెర్షన్ ఏదో చెబుతున్నారని శంకర్ అన్నారు. రచయితల సంఘం అధ్యక్షుడైన పరుచూరి గోపాలకృష్ణకు ఫిర్యాదుచేయమని సలహా ఇచ్చారు. దాంతో జనవరి 6వ తేదీన కొరటాల శివ మీదా, మైత్రీ మూవీస్ మీదా కంప్లైంట్ చేశాను. అన్ని రకాల ఆధారాలు ఉన్నా కనీసం డిస్ ప్యూట్ కమిటీకిగాని, కథా హక్కుల వేదికకు గానీ నా ఫిర్యాదును పరిశీలించమని సూచన కూడా చేయలేదు. నన్ను కోర్టుకు వెళ్లమని లేఖ ఇచ్చారు. రైటర్స్ అసోసియేషన్ కూడా నా విషయంలో ఏకపక్షంగా వ్యవహరించింది. 18 సంవత్సరాలుగా సినిమానే నమ్ముకున్న నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది. మా ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నా ఈ విషయంలో తనేం చేయలేనని, నన్ను కోర్టుకు వెళితే వెళ్లమని సూచించారు.
చిరంజీవి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం ఎందుకు చేయలేదు?
చిరంజీవిగారి మీద నాకు ఎప్పుడూ గౌరవం ఉంది. ఆయన దృష్టికి తీసుకువెళ్లమని కొంతమంది పెద్దల్ని కూడా కోరాను. మంచి ఉంటే మైకులో చెప్పండి… చెడు ఉంటే చెవిలో చెప్పండి అనే విషయాన్ని నేను గౌరవించాను. కరోనా కారణంగా నన్ను మీడియా దగ్గరకు వెళ్లకుండా ఆపగలిగారు. నేను చిరంజీవిగారిని కలిసే మార్గం దొరకలేదు. మీడియా కెక్కితేనే చిరంజీవిగారి దృష్టికి, రామ్ చరణ్ గారి దృష్టికి వెళుతుందనే నమ్మకం కలిగింది. సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందుకు వస్తా.
దీని మీద మీరు ఎలా ఫైట్ చేయబోతున్నారు?
ఇప్పటిదాకా బ్యాక్ డోర్ లో ఫైట్ చేస్తూ వచ్చా. 2017లో సినాప్సిస్, 2018లో పూర్తి స్క్రిప్టు రిజిస్టర్ చేసి ఉన్నా ఇలా జరిగింది. నా వర్కింగ్ టైటిల్ పెద్దాయన… వీళ్లేమో ఆచార్య అని పెట్టారు. నేను సోషల్ మీడియాకు వస్తున్నానని లెటర్ ప్రిపేర్ చేస్తుంటే ఈలోపు వాళ్లు గేమ్ స్టార్ట్ చేసి ఇంకో పేరును తెరమీదికి తెచ్చారు. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి… ఎవరూ తప్పించుకోలేరు. వాటిని త్వరలోనే బయటపెడతా.
– హేమసుందర్ పామర్తి