ఏపీ సీఎం జగన్ రెడ్డిపై, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు లేఖల దాడిని కొనసాగిస్తున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఎన్నికల హయాంలో జగన్ ఇచ్చిన హామీలపై లేఖల మీద లేఖల రాస్తూ వైసీపీ ప్రభుత్వానికి ఊపిరి కూడా పీల్చుకోనివ్వడం లేదు. రఘురామ లేఖలపై వైసీపీ నాయకులు అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా… ఏపీ ప్రజలు మాత్రం సమర్థిస్తున్నారు. కక్ష సాధింపు ధోరణితో కాకుండా.. ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తూ, ప్రభుత్వ బాధ్యతలను గుర్తుచేస్తూ అసలైన రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఎన్నో లేఖలు రాసిన రఘురామరాజు తాజాగా మరో లేఖ సంధించారు. ఈ లేఖలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావించారు.
జీతాలు చెల్లించని దుస్థితి…
సరైన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన జీతాలను ఏపీ ప్రభుత్వం అందించడం లేదని.. ఈ కారణంగా రాష్ట్రంలోని నాలుగు లక్షల మందిపైగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రఘురామరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధులను సమర్థవంతంగా నిర్వహించే ఉద్యోగులకు విడతలవారీగా జీతాలు చెల్లించడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. సకాలంలో జీతాలు అందకపోవడంతో 2 లక్షల 88 మంది వేలకుగాపై ప్రభుత్వ ఉద్యోగాలు పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3.5 లక్షల మంది పెన్షనర్లకు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. రెండేళ్లలో మీ నాయకత్వంలో రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ఏనాడు కూడా బాగాలేదని పేర్కొన్నారు.
ఎన్నాళ్లీ కుంటిసాకులు
కరోనా పేరు చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు విడుతలవారీగా జీతాలు చెల్లిస్తున్నారని, ప్రభుత్వం కుంటిసాకులు చెబుతుండటంతో ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని రఘురామరాజు స్పష్టం చేశారు. ఒకవైపు కరోనా, మరోవైపు లాక్ డౌన్ పరిస్థితులు కారణంగా ప్రైవేట్ టీచర్లు ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతూ పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం సరైన సమయంలో జీతాలు ఇవ్వాలని ఎంపీ రఘురామరాజు డిమాండ్ చేశారు.











