తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అవకాశంగా మలుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో బలపడేదుకు బీజేపీ తన ప్రయత్నాలను ప్రారంభిస్తోందా? ఇలాంటి చాన్స్ మళ్లీ మళ్లీ రాదని ఆరాటపడుతోందా? హిందూత్వ ఎజెండాతో జనాన్ని ఏకం చేయడం.. వారిలో ఒక భయాన్ని రేకెత్తించి ఆ భయాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడం వారి వ్యూహంగా ఉందా? ఇలాంటి అనుమానాలు, ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో రేకెత్తుతున్నాయి.
ఇటీవల వరసగా హిందూ దేవాలయాల పైన జరుగుతున్న దాడులను ఆసరాగా తీసుకుని వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ సన్నాహాలు చేపట్టింది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా ఆంతర్వేది లో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రధం దగ్ధం సంఘ్తటనను బీజేపీ, హిందు సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చినీయంశం గాచేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేత సి.బి.ఐ. దర్యాప్తు కు ఆదేశించే విధంగా చేసారు. తదనంతరం విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వెండి రధం పై ఉన్న సింహం బొమ్మలు అదృశ్యం కావటం, వెంటనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం, పిదప రాష్ట్ర గవర్నర్ ను కలిసి వరసగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేయటం. వంటి వరస సంఘటనలు చూస్తుంటే బీజేపీ తాను బలపడేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనపడుతోంది.
అంతేకాక భారతీయ జనతాపార్టీ కి చెందిన రాజ్యసభ సభ్యులు జి. వి.ఎల్.నర సింహారావు, సి.ఎం.రమేష్ లు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు ఒక లేఖ రాయడం చర్చనీయంశమయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలపై హోంశాఖ జోక్యం చేసుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ లేకుండా పోయిందని ఆ లేఖలో ప్రస్తావించారు. అంతేగాక హిందువులే లక్ష్యంగా అనేక ఘటనలు జరుగుతున్నప్పటికి రాష్ట్ర లోని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అందువల్ల కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
తాజాగా జరుగుచున్న ఈ ఉదంతాలను బట్టి చూస్తే బీజేపీ రాష్ట్రంలో ఎత్తిపరిస్థితులలోను గట్టిగా బలపడి అధికారాన్ని చేజిక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దీన్నిబట్టి రాష్ట్రంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి తెలుగుదేశం తో పాటు బి.జి.పి. కూడా ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.











