( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాక నిరుద్యోగ సమస్య తాండవిస్తోందని, రెండేళ్లలో ఏ ఒక్కటీ రాకపోగా వచ్చేవాటిని వెనక్కు పంపిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విశాఖ పర్యటనలో భాగంగా యువతతో ముఖాముఖి నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
అదాని గ్రూప్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కష్టాలు పడాల్సి వచ్చిందని, పొరుగు రాష్ట్రాలతో పోటీ అధికంగా ఉండడంతో అత్యంత గోప్యంగా ఒప్పందం చేసుకునే వరకు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఆ సంస్థ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నాారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఒక్క ఇటుక కూడా వినియోగించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి ఉంటే లక్ష మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించి ఉండేవన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ముట్టుకోకుండా మరో 10 స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేసినా ఎవరూ అడ్డు చెప్ప రని అన్నారు. గత ముఖ్యమంత్రి హయాంలో ఎంతో కష్టపడి తీసుకువచ్చిన సోలార్, ఫ్రాంక్లిన్, డేటా సెంటర్… వంటి పరిశ్రమలన్నింటిని వెనక్కు పంపేశారని అన్నారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు..
రాష్ట్రంలో మహిళలకు భద్రత కొరవడిందని, దిశ చట్టం వల్ల ఎవరికి ప్రయోజనం లేకుండా పోయిందని ఓ యువతి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. దిశ చట్టాన్ని ఇప్పటివరకు చేయలేదని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నిస్తే… “మీకు తెలియదు.. దిశ మీకు ఇష్టం లేదా” అంటూ మాపై ఎదురు ప్రశ్నలు వేసిన ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. అందుకే దిశా పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉంటున్నాయని అన్నారు. మహిళల భద్రతకు కఠిన చట్టాలు ఉన్నప్పటికీ, అమలు చేయడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందన్నారు. చట్టాల అమలు పాలకుల తీరుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కొందరు మంత్రులు వ్యాఖ్యలను నారా లోకేష్ తప్పు పట్టారు. అనేక సందర్భాల్లో “నీ అమ్మ మొగుడు” అని మంత్రులు సంబోధిస్తూ ఉన్నారని, అటువంటి పదాలు మహిళలను కించ పరచడమేనని చెప్పారు. చంద్రబాబు హయాంలో మహిళలపై దాడులు చేయాలంటే భయపడేవారని, ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని అన్నారు. సమాజంలో, కరిక్యులంలో మార్పు వస్తేనే మహిళలకు భద్రత ఉంటుందని చెప్పారు.
రూ.5, 000 దేనికి సరిపోతాయి..
రాష్ట్రంలో ఇరవై ఒక్క శాతం యువతకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిన ప్రభుత్వం.. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిందని మరో యువకుడు ప్రశ్నించాడు. ఉద్యోగాల పేరిట వాలంటీర్లకు రూ. 5, 000 వేతనం ఇస్తే దేనికి సరిపోతుందని ప్రశ్నించాడు. అందుకు లోకేష్ బదులిస్తూ రోజుకు ఎన్నో గంటలు శ్రమ పడుతున్న వలంటీర్లకు తగ్గ ఫలితం దక్కడం లేదన్నారు. రెండేళ్ల కాల పరిమితి ముగిస్తే సెక్రటరియేట్‌లో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఉద్యోగాలు మానేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ప్రోత్సహిస్తేనే యువతకు ఉపాధి దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం రెండేళ్ల కాలంలో రూ.1.73 లక్షల కోట్లు అప్పు చేసిందని, రానున్న రోజుల్లో ఆ అప్పులు ఆరు లక్షల కోట్లకు చేరుతుందన్నారు. అప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా సాధ్యం కాదని భవిష్యత్ పరిణామాలను లోకేష్ వివరించారు. తెలుగుదేశం హయాంలో రెండు డిఎస్సీ నియామకాలు చేపడితే, ప్రస్తుత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయిందన్నారు. 75 శాతం స్థానికులకే రిజర్వేషన్ అన్నిరాష్ట్రాల్లో అమలైతే ఇక మనం ఎక్కడికి పోయి ఉద్యోగాలు చేసుకుంటామని ప్రశ్నించారు. ఏపీ చేసిన ఈ బాటలోనే మరో మూడు రాష్ట్రాలు 75 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నాయని, దానికన్నా పరిశ్రమలను పెంచడం వల్ల ఉపాధి పెరుగుతుందని చెప్పారు.
Must Read ;- ప్రశాంత విశాఖలో వైసీపీ చిచ్చు. ఓటుతో బుద్ధిచెప్పాలన్న లోకేష్