కొవిడ్ కారణంగా రైల్వే సర్వీసులను రద్దు చేసింది ప్రభుత్వం. వాటిలో కొన్నింటినీ పునరుద్దరించినా.. కరోనా జాగ్రత్తలలో భాగంగా ఆహారం, బ్లాంకెట్స్, నీరు ఎవరికి వారే తెచ్చుకోవాలని తెలియజేసింది. ముఖ్యంగా ఏసీ కోచ్‌లలో బెడ్‌లను తొలగించింది.. దానితపాటు బ్లాంకెట్స్ కూడా ఎవరికి వారే తెచ్చుకోవాలని ముందుగానే తెలియజేసింది. ప్రయాణికులకు ఉన్న లగేజీతోపాటు ఇదొక ఎక్స్‌ట్రా లగేజీలా తయారైంది. అటువంటి ప్రయాణికుల కోసం ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చింది రైల్వే సంస్థ.
ఇక నుండి ప్రయాణికులకు డిస్పోజబుల్ ట్రావల్ కిట్‌ను అందివ్వనున్నట్లు తెలియజేసింది. దాని విలువ 275 రూపాయలు అని తెలిపింది. అందులో ఒక బ్లాంకెట్, రెండు బెడ్ షీట్స్, ఒక దిండు, ఒక హెడ్ కవర్, ఒక జత గ్లౌజెస్, ముఖానికి మాస్క్, శానిటైజర్, పేపర్ సోప్, పేపర్ న్యాప్కిన్.. వంటి వస్తువులను ఒక ప్యాక్‌లాగా అందించనున్నట్లు తెలియజేసింది. ఇవన్నీ ఒకసారి వాడి పారేయవచ్చని.. కాబట్టి కరోనా వ్యాప్తి భయం ఉండదని తెలియజేసింది. చలి తీవ్రత పెరిగిన కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే సంస్థ తెలియజేసింది. ఈ సరికొత్త సర్వీసుల ఛార్జీల రూపంలో ప్రజలే భరించాల్సి ఉంటుంది.











