(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆంధ్రా అయోధ్యగా, ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరు గాంచిన రామతీర్థంలో జరిగిన అమానుష చర్యపై ఆగ్రహజ్వాలలు ఆరక ముందే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు, రాజమహేంద్రవరంలోనూ దుండగులు రెచ్చిపోయారు. హిందూ ఆలయాలపై దాడులు చేసి, విగ్రహాలను ధ్వంసం చేసి, హుండీను పగుల గొట్టి నగదు అపహరించుకుపోయారు. అయినా ప్రభుత్వం గాని, సంబంధిత మంత్రి గాని స్పందించకపోవడం పట్ల స్థానికులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.
విశాఖలో ..
విశాఖ ఏజెన్సీలోని ఘాట్ రోడ్డు మార్గంలో వంట్లమామిడి సమీపాన ఉన్న కోమాలమ్మ పాదాలను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం వేకువ జామున ధ్వంసం చేశారు. ఆ ప్రాంత వాసులు ఎంతో విశ్వసించే అమ్మవారి పాదాలను ధ్వంసం చేయడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిక్కోలులో ..
శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని అల్లఖోల గ్రామంలోని సాయిబాబా గుడిలోని హుండీని దుండగులు శుక్రవారం వేకువజామున పగులగొట్టి అందులోని నగదు అపహరించుకుపోయారు. రాజమహేంద్రవరంలోని శ్రీ సంకటహర విఘ్నేశ్వర స్వామి దేవాలయంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెండు చేతులను గుర్తు తెలియని వ్యక్తులు ఖండించిన విషయం తెలిసిందే. ఒకేరోజు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలపై దాడిని ఆయా ప్రాంతాల వారు తీవ్రంగా ఖండిస్తున్నారు.
సీఎం స్పందించిన కొన్ని గంటల్లోనే ..
విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండరాముని విగ్రహ ధ్వంసంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించిన కొన్ని గంటల వ్యవధిలోనే శుక్రవారం రాష్ట్రంలోని రాజమహేంద్రవరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మూడుచోట్ల హిందూ దేవాలయాలపై దాడులు జరగడంపై హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అదుపులో ఐదుగురు అనుమానితులు
విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలోని కోదండ రాముడి విగ్రహం ధ్వంసం చేసిన కేసులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు విజయనగరం డీఎస్పీ అనిల్ తెలిపారు. రామతీర్థం ఆలయం ఘటన విషయంలో కావాలనే కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తన కార్యాలయంలో మీడియాతో డీఎస్పీ మాట్లాడుతూ.. కోదండరాముడి విగ్రహం శిరస్సును ఛిద్రం చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. ఈ ఘటన ప్రధాన ఆలయంలో జరగలేదని, ఎదురుగా ఉన్న బోడికొండపై ఉన్న చిన్న ఆలయంలో చోటు చేసుకుందని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పారు. శాంతి భద్రతలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రజలు, రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని కోరారు. ప్రధాన ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయని, కొండపై కూడా ఏర్పాటు చేయాలని ఇటీవలే దేవాదాయ శాఖకు లేఖ రాశామన్నారు. అంతలోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు.