బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో ఎక్కువగా హీరోయిన్లే ఇన్‌వాల్వ్ అయి ఉండడం అందర్నీ కలవరపెడుతోంది. రకుల్ ప్రీత్, దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ వంటి హీరోయిన్ల పేర్లు ఈ కేసులో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ నలుగురినీ ఎస్.సి.బి. అధికారులు విచారించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో అధికారులు తమ విచారణను ముమ్మరం చేశారు. రియా చక్రవర్తితో అత్యంత సన్నిహితంగా మెలిగిన హీరోయిన్ రకుల్. తాను డ్రగ్స్ గురించి రియాను అడిగిన మాట వాస్తవమేనని, అయితే తాను డ్రగ్స్ ఎప్పుడూ తీసుకోలేదని విచారణలో వెల్లడించింది.
ఈ విచారణలో మరో విశేషం ఏమిటంటే ఈ నలుగురు హీరోయిన్లూ ఒకే రకమైన సమాధానాలు చెప్పారని అధికారులు అంటున్నారు. ఈ నలుగురు హ్యాష్ అనే డ్రగ్ గురించి ప్రస్తావించారని విచారణలో తేలింది. అయితే హ్యాష్ అనేది డ్రగ్ కాదని, అది మత్తు కలిగించదని ఈ నలుగురు హీరోయిన్లు చెబుతున్నారు. ఎన్.సి.బి. అధికారులు మాత్రం ఈ కేసు విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. మరింత లోతుగా విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ డ్రగ్స్ వ్యవహారం ఒక కొలిక్కి రావాలంటే ఆరు నెలలు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎన్.సి.బి. అధికారుల దగ్గర 20 మంది డీలర్ల సమాచారం ఉందని తెలుస్తోంది.
ఈ వ్యవహారం సినీ పరిశ్రమ మీద, దర్శకనిర్మాతల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ఎందుకంటే డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు హీరోయిన్లు వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నవారే. రకుల్ ప్రీత్ వల్ల టాలీవుడ్ దర్శకనిర్మాతలకు టెన్షన్ మొదలైంది. పవన్‌కల్యాణ్ తను చేస్తున్న వకీల్‌సాబ్ తర్వాత క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోవడం, పవన్ మళ్లీ షూటింగ్‌లో ఎప్పుడు పాల్గొంటాడో తెలియకపోవడం వల్ల ఈలోగా ఒక చిన్న సినిమా చేద్దామని క్రిష్ రెడీ అయిపోయాడు. వైష్ణవ్‌తేజ్ హీరోగా ఓ సినిమాను ప్రారంభించి షూటింగ్ కూడా చేస్తున్నాడు.
ఈ సినిమాలో రకుల్ హీరోయిన్. దీంతో ఈ సినిమా దర్శకనిర్మాతలకు టెన్షన్ మొదలైంది. సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమాను పూర్తి చేసి పవన్‌కల్యాణ్ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళాలని భావించిన క్రిష్‌కి ఈ డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు కూడా ఉండడం పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఎన్.సి.బి. అధికారుల విచారణకు హాజరైన రకుల్ ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే వరకు పలుమార్లు అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది.
క్రిష్ సినిమాకు బల్క్‌గా నెలరోజుల కాల్షీట్స్ ఇచ్చిన రకుల్ ఎక్కవ రోజులు ముంబాయిలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల క్రిష్ సినిమా షూటింగ్ కోసం రకుల్ హైదరాబాద్ వచ్చిందని, షూటింగ్‌లో పాల్గొంటోందని తెలుస్తోంది. అయితే ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతానో లేదోననే సందేహం క్రిష్ మనసులో ఉంది. ఈ పరస్థితుల్లో షూటింగ్‌ను ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత మంచిదని క్రిష్ భావిస్తున్నాడు. మరి ఈ కేసు విషయంలో రకుల్‌కి ఊరట లభిస్తుందో లేక మరింత జఠిలంగా మారుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.











