ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబరు 5వ తేదీన పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి సంబంధించి సన్నాహాలు పూర్తవుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెరవాలనే నిర్ణయాన్ని మరో నెలపాటు వాయిదా వేసింది. కాకపోతే.. జగనన్న విద్యాకానుక పథకం ప్రకారం.. వారికి కిట్ లను మాత్రం 5వ తేదీనుంచి అందజేసేలా నిర్ణయించారు.
అక్టోబరు 5న పాఠశాలలు తిరిగి తెరవాలని జగన్మోహన్ రెడ్డి చాలాకాలం కిందటే నిర్ణయించారు. అప్పటికి లాక్ డౌన్ 4.0 ప్రకటన కూడా రాలేదు. కేంద్రంనుంచి ఈ విషయంలో అనుమతులు ఎలా ఉంటాయనే ఆలోచన కూడా వుండక పూర్వమే పాఠశాలలు తిరిగి తెరవడం గురించిన ప్రకటన వచ్చింది. దానికి తగ్గట్టుగానే కేంద్రం కూడా పాఠశాలలు తిరిగి తెరవడానికి అనుమతులు ఇచ్చింది. కాకపోతే.. తదనుగుణమైన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు చెప్పింది.
ఇలాంటి నేపథ్యంలో అక్టోబరు 5వ తేదీన పాఠశాలలు తిరిగి తెరడానికి నిర్ణయం జరిగింది. జగనన్న విద్యాకానుక కిట్లను అదేరోజున అందజేసి పాటశాలలు తిరిగి తెరవాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. స్కూళ్లకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు సుముఖంగా ఉన్నారా లేదా అనే అభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. అయితే మెజారిటీ తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు ఇష్టపడడం లేదని తెేలింది.
పైగా కరోనా ఉధృతి రాష్ట్రంలో ఏమాత్రం తగ్గనే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో… పాఠశాలలు తిరిగి తెరవడం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావించింది. అందుకే తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. నవంబరు 2 వ తేదీనుంచి తిరిగి తెరవనున్నట్టు నిర్ణయించారు.
స్కూల్ల ప్రారంభం వాయిదా పడినప్పటికీ.. జగనన్న విద్యాకానుక పథకాన్ని మాత్రం అక్టోబరు 5న సీఎం జగన్ చేతుల మీద ప్రారంభించనున్నారు. వీలును బట్టి.. రాష్ట్రంలో ఏదో ఒక చోట.. జగన్ ప్రారంభిస్తారని అంటున్నారు.











