ఏపీ ప్రభుత్వం మూడు రోజుల క్రితం రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2006 బ్యాచ్‌కు చెందిన డీఐజీలకు ఐజీలుగా ప్రమోషన్ కల్పించింది. వీరిలో కొల్లి రఘురామరెడ్డి, సర్వశ్రేష్ట త్రిపాఠి, అశోక్ కుమార్, విజయ్‌కుమార్, హరికృష్ణ, ఎం. రవిప్రకాష్, రాజశేఖర్, కేవీ మోహన్‌రావు, రామకృష్ణకు ఐజీలుగా ప్రమోషన్లు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. డిప్యుటేషన్‌లో ఉన్న రవికృష్ణ, జయలక్ష్మికి కూడా ప్రమోషన్ కల్పించింది. వీళ్లకు జనవరి 1వ తేదీ నుంచి పదోన్నతలు వర్తించుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే, జగన్మోహన్ రెడ్డికి సహకరించిన వారికి మాత్రమే ఈ పదోన్నతులు ఇచ్చారని అంటున్నారు. ఈ లిస్టులో గత అయిదేళ్లుగా టీడీపీ నేతలపై లేనిపోని కేసులు బనాయించిన వారికే కీలక పదవులు కట్టబెట్టారనే చర్చ నడుస్తోంది. ఇంటిలిజెన్స్ డీఐజీగా ఉన్న కొల్లి రఘురామ రెడ్డి లాంటి వారు చంద్రబాబుని అరెస్టు చేసిన వారిలో ఉన్నారు. ఈయనే కాకుండా మిగిలిన అధికారులు కూడా టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టిన వారిలో ఉన్నారు. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గుంటూరు అర్బన్ పోలీస్ అధికారిగా డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ పని చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే ఈయనకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదోన్నతి లభించింది. తాజాగా ఇన్పెక్టర్ జనరల్ గా ప్రమోషన్ వచ్చింది.
జగన్ మోహన్ రెడ్డి తనకు సహకరించిన పోలీసు అధికారులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే సంగతి గోరంట్ల మాధవ్ విషయంలోనే రుజువు అయింది. ఒక అనామక సీఐని జగన్ ఏకంగా ఎంపీని చేశారు. మరోవైపు శ్రీకాళహస్తి సీఐ అయిన అంజూయాదవ్‌పై ఫిర్యాదులు వస్తున్నా ఆమెపై జగన్ ప్రభుత్వం, ఇతర పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. హోటళ్ల ముందుకెళ్లి తొడ కొట్టటం, వెకిలి నవ్వులతో వార్నింగ్ లు ఇవ్వడం.. టీడీపీ నేతలపై దురుసు ప్రవర్తనతో ఆమె వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయినా ఆమెపై ఎలాంటి చర్యలు లేవు.
గత నాలుగేళ్లుగా ప్రతిపక్ష పార్టీలను వేధించటానికే పోలీసు శాఖను జగన్ ప్రభుత్వం వినియోగించుకుంటుంది. టీడీపీ కార్యకర్తలపైకి పోలీసులను ఉసిగొల్పడమే పనిగా ఉన్నతాధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకట రమణను కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులు గత నెలలో అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. చేతులు వెనక్కి కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి కొట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై నారా లోకేశ్ గళం ఎత్తినా ఫలితం లేకపోయింది. పోలీసు వ్యవస్థ మొత్తాన్ని తాను ఆడించేలా జగన్ తన గుప్పిట్లోనే పెట్టుకొని.. తన మెప్పు పొందిన ఉన్నతాధికారులకు ఇలా ప్రమోషన్లు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి.