తెలంగాణలో ముగిసిన ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విపరీతమైన ధీమాతో ఉండేవారు. తెలంగాణలో ఇక తనకు తిరుగులేదనే విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి.. దేశ రాజకీయాల్లోకి వెళ్దామని ప్లాన్ వేశారు. అందుకోసం ఆయన అప్పట్లో మహారాష్ట్ర వెళ్లి సభలు పెట్టడాలు కూడా చేశారు. తన బలం ఏంటో నిరూపించుకోవడానికి ఏకంగా 500 కార్లలో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్లారు. కానీ, ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. దేశ రాజకీయాల సంగతి అటుంచి.. కనీసం రాష్ట్ర రాజకీయాల నుంచి కూడా ప్రస్తుతం తాత్కాలికంగా దూరంగా ఉన్నారు.
దీంతో బీఆర్ఎస్ పార్టీని పక్క రాష్ట్రాలకు విస్తరించాలనే ఆలోచనలకు కూడా అడ్డుకట్ట పడిపోయింది. అటు తెలంగాణ – మహారాష్ట్ర బోర్డర్ లో కొన్ని ప్రాంతాలు బీఆర్ఎస్ వైపు ఎక్కువ ఆకర్షించేవి. అలాగే తెలంగాణలో జరుగుతున్న డెవలప్ మెంట్ చూసిన ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ సమర్థత మీద ఎంతో నమ్మకం కూడా ఉండేది. ఏపీలో కేసీఆర్ కు అభిమాన సంఘాలు కూడా ఉండేవి. బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ఏపీ బీఆర్ఎస్ పార్టీని కూడా పట్టించుకోవడం మానేశారు. ఒకవేళ తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి ఉంటే.. రాబోయే ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏదో ఒక కీలక పాత్ర పోషించేది. నేరుగా ఎన్నికల బరిలో నిలవకపోయినప్పటికీ కూడా.. కనీసం బహిరంగంగా వైఎస్ జగన్ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వడం అయినా చేసి ఉండేది. అలా చేయడం జగన్ కి బాగా లాభం అయ్యేది.
ఇప్పుడు, కేసీఆర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తుంటి విరిగి, శస్త్రచికిత్స చేయించుకొని ఇంటికే పరిమితం అయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన తల ఎత్తుకోలేక మీడియా ముందుకు కూడా రాలేకపోయారు. తెలంగాణ ప్రజల ముందుకు మళ్లీ ఎప్పటికి వస్తారో కూడా ఎవరికీ తెలీదు. సొంత రాష్ట్రంలో ప్రజల ముందుకే రాకుండా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న కేసీఆర్.. పక్క రాష్ట్రాల్లో పోటీకి సాహసం అస్సలు చేసే ప్రసక్తే లేదు. కనీసం తన మిత్రుడు జగన్ పార్టీకి మద్దతు ఇచ్చినా ఏ ఫలితం ఉండదు. సొంత రాష్ట్రంలోనే చతికిల పడ్డ బీఆర్ఎస్ పార్టీ.. పక్క రాష్ట్రంలో జగన్ పార్టీకి మద్దతు ఇస్తే అది కామెడీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల కోసం జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణలోని రాజకీయ పార్టీల నుంచి ఇక ఏ మద్దతూ లభించదు. ఇది టీడీపీకి బాగా కలిసి వచ్చే అంశం కానుంది.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబుతో మంచి సంబంధాలే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడు కూడా. ఇప్పటికీ రేవంత్ రెడ్డి చంద్రబాబుపై అపారమైన గౌరవంతో ఉంటారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం మౌనంగా ఉండి చంద్రబాబు చక్రం తిప్పారు. టీడీపీని బరిలో నిలపకుండా కీలక నిర్ణయం తీసుకోవడంతో.. అంతా నవ్వుకున్నారు. కానీ, అది బీఆర్ఎస్ ఓటమికే దారి తీయడంతో బీఆర్ఎస్ శ్రేణులు సైతం షాక్ కు గురయ్యారు. ఈ పరిణామంతో చంద్రబాబు రాజకీయ చతురత, వ్యూహాలు ఎంత పదునుగా ఉంటాయో మరోసారి జనం చూశారు. ఇలా ఒకే దెబ్బకు ఏపీలో జగన్‌కు తెలంగాణ నుంచి ఉన్న తోడును దూరం చేయగలిగారు. దీంతో టీడీపీకి ఏపీలో విజయం అనేది చాలా సులభం కానుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.