కొత్త రకం కథల వైపు స్టార్ మా దృష్టి మళ్లిస్తోంది. అందులో భాగంగానే ‘రుద్రమదేవి’ సీరియల్ కు శ్రీకారం చుట్టింది. టెలివిజన్ చరిత్రలో స్టార్ మా చేస్తున్న కొత్త ప్రయోగమిది. విశిష్ట వ్యక్తుల చారిత్రక గాథల్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సీరియల్ ప్రీమియర్ ను మీడియా కోసం ఈరోజు ప్రదర్శించారు. అద్భుతమైన దృశ్య కావ్యంలా ఈ కథను మలిచారు.
రుద్రమదేవి పేరు వింటేనే ప్రతి తెలుగు హృదయం స్పందిస్తుంది. ఆ నాయకురాలి కథను మెగా సీరియల్ గా బృహత్తరమైన కార్యానికి స్టార్ మా శ్రీకారం చుట్టింది. ఈ కథను యథాతథంగా అందించేందుకు వందలాది మంది దీనిపై పనిచేస్తున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కాకతీయుల సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరిస్తున్నారు. ఈ జనవరి 18 నుంచి ఈ సీరియల్ స్టార్ మాలో ప్రసారమవుతుంది.
ఆ రోజు రాత్రి 9 గంటలకు ప్రసారం చేయాలని నిర్ణయించారు. ఇంతకుముందెప్పుడూ బుల్లి తెరపై ఈ తరహా ప్రమాణాలతో సీరియల్ రాలేదని చెబుతున్నారు. రుద్రమదేవి కథ సినిమాగా వచ్చినా ఆ కథా పరిధి తక్కువ కాబట్టి అన్ని విషయాలనూ చెప్పడానికి వీలుపడదు. ఇప్పుడు చరిత్రలో మరుగున పడిపోయిన రుద్రమదేవికి సంబంధించిన అనేక విశేషాలను ఈ సీరియల్ ద్వారా చూపనున్నారు.