(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లాలో 954 మందికి తొలిరోజు కరోనా వ్యాక్సిన్ వేసినట్లు, వారిలో ఇద్దరు స్వల్ప అస్వస్థతకు గురై, అనంతరం మేల్కొన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణకుమారి తెలిపారు.
జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన తొలిరోజైన శనివారం 954 మంది వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది కరోనా టీకాలు వేయించుకున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తెలిపారు. జిల్లాలో 1441 మంది తొలిరోజు టీకా వేయించు కొనేందుకు కోవిన్ యాప్‌లో నమోదు చేసుకోగా వారిలో 1057 మంది టీకాల కార్యక్రమానికి హాజరయ్యారని, 954 మంది టీకాలు వేయించుకున్నట్టు ఆమె పేర్కొన్నారు.
వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఇద్దరు మాత్రమే స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, అది కూడా చిన్నపాటి అనారోగ్యం మాత్రమేనని తెలిపారు. బొబ్బిలి నియోజకవర్గం జగన్నాధపురం పి.హెచ్.సి.లో ఒకరు, ఎస్.కోటలో ఒకరు మాత్రమే కొద్దిపాటి అనారోగ్యానికి గురై వెంటనే వైద్యుల చికిత్సతో కోలుకున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం అయ్యిందన్నారు.
అందరికీ కరోనా టీకా .. ఆత్రుత వద్దు : బొత్స
దశలవారీగా అన్నివర్గాల వారికీ కరోనా టీకా వేస్తారని, ఎవ్వరూ ఆత్రుత పడొద్దని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. జిల్లాలో కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేటి నుంచి కరోనా వాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే 26 వేల మంది కింది నుంచి పై స్థాయి ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది, అధికారులకు తొలి విడతగా వాక్సినేషన్ చేయనున్నట్టు తెలిపారు. దశల వారీగా అన్ని వర్గాల వారికి కరోనా టీకా వేసే కార్యక్రమం చేపడతామని,ఎవ్వరూ వాక్సిన్ వేయించు కోవడానికి ఆతృత పడొద్దని సూచించారు. జిల్లాలోని 15 ఆసుపత్రుల్లో ఈ వాక్సినేషన్ చేపట్టామని తెలిపారు. 28 రోజుల తర్వాత రెండో డోసు వాక్సిన్ వేస్తారని మంత్రి చెప్పారు.
కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ డా. ఎం. హరిజవహర్ లాల్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణ కుమారి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సీతారామ రాజు, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డా. నారాయణ తదితరులు పాల్గొన్నారు.