‘ఛలో, గీతగోవిందం’ చిత్రాలతో టాలీవుడ్ లో వరుస విజయాలు సొంతం చేసుకొని టాప్ భామల లిస్ట్ లోకి చేరిపోయింది కన్నడ కస్తూరి రష్మికా మందణ్ణ. ఆకర్షించే అందంతో పాటు, ఆకట్టుకొనే అభినయం కూడా ఉండడంతో అది మరింత అడ్వాంటేజ్ అయింది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక ఆఫర్స్ దక్కించుకొని.. టాలీవుడ్ లో మిగిలిన భామలకు గట్టిపోటీగా మారింది. మధ్యలో దేవదాసు, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలతో పరాజయాలు ఫేస్ చేసినప్పటికీ.. అవి కెరీర్ మీద ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. పైపెచ్చు.. పెద్ద ఆఫర్స్ అందిపుచ్చుకుంది.
ఈ ఏడాది మహేష్ బాబులాంటి టాప్ హీరోతో ‘సరిలేరునీకెవ్వురు’, నితిన్ లాంటి యంగ్ హీరోతో ‘భీష్మ’ సినిమాలు చేసి వరుస బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకుంది. దాని ఫలితంగా రష్మికా బేబ్.. ఒకేసారి అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’లోనూ, రామ్ చరణ్ ఎక్స్ టెండెడ్ క్యామియో పాత్ర చేస్తున్న ‘ఆచార్య’లో అతడి సరసన కథానాయికగా అవకాశాలు అందుకొని.. టాలీవుడ్ లో తనకిక తిరుగేలేదని నిరూపించుకుంది. ఇలా ఒకేసారి మెగా హీరోలు.. పైగా బావ బామ్మర్దులైన అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో రొమాన్స్ కు సిద్ధపడిన రష్మికా టాలీవుడ్ లో చర్చకు దారితీసింది.
నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతోన్న ‘పుష్ప’ సినిమా కోసం రష్మికా మందణ్ణ మీద ఇటీవల టెస్ట్ షూట్ చేశారట .
ఈ లుక్ టెస్ట్ యూనిట్ లో వారందరికీ బాగా నచ్చిందట. అలాగే.. డైరెక్టర్ సుకుమార్ రష్మికా లుక్ విషయంలో పూర్తిగా సంతృప్తిచెందాడట. అందుకే ఆ లుక్ ను ఫైనల్ చేశారట. ఇక ఆచార్య విషయానికొస్తే.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో రామ్ చరణ్ పెయిర్ గా నటించే రష్మికా లుక్ మీద త్వరలో టెస్ట్ షూట్ చేయబోతున్నారట. వచ్చేవారం ఈ షూట్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ కి పీరియాడికల్ టచ్ ఉండడంతో అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా రష్మికా కట్టు బొట్టు డిజైన్ చేశారట. వచ్చేనెల్లోనే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షెడ్యూల్ స్టార్ట్ కానుంది. కాబట్టి.. ఈ పాత్ర కోసం రష్మికా పూర్తిగా ప్రిపేర్ అవుతోందట. సో.. వచ్చే రెండు నెలల్లోనూ రష్మికా .. మెగా హీరోల సినిమాలతోనే పూర్తిగా లాక్ కాబోతోంది.
ఒక పక్క బావతోనూ, మరో పక్క బావమరిదితోనూ రష్మికా రొమాన్స్ చేయనుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రెండు సినిమాల్లోనూ రెండు డిఫరెంట్ పాత్రలు చేయబోతుండడంతో .. అమ్మడు ఆ మేరకు తన మేకోవర్ పట్ల పూర్తిగా శ్రద్ధ తీసుకోబోతోంది. నిజానికి కాజల్ కు గతంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఒక పక్క అల్లు అర్జున్ తో ‘ఆర్య 2’ లో నటిస్తూనే.. మరో పక్క చరణ్ తో ‘మగధీర’లోనూ నటించింది కాజల్. అప్పట్లో రెండు షూటింగుల కోసం కాజల్ అటు, ఇటు పరుగుపెట్టింది. ఇప్పుడు అదే పరిస్థితి రష్మికా మందణ్ణకు ఎదురైంది. మరి ఈ రెండు సినిమాలతోనూ రష్మికా ఏ రేంజ్ లో సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.











