హిట్టు అంటూ పడాలే కానీ.. దర్శకులకు ఆఫర్స్ కరువా?. అందులోనూ తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ కొడితే.. ఆ కిక్కే వేరప్పా.. అని ఆ దర్శకులు అనుకోకుండా ఉంటారా? కాకపోతే.. తదుపరి చిత్రానికి కథ దొరక్కో , హీరోలు అందుబాటులో లేకో లేక.. ఇతర కారణాల వల్లనో .. తొలి సక్సెస్ సాధించిన కొందరు దర్శకులు ఇంత వరకూ తమ రెండో ప్రాజెక్టే మొదలు పెట్టలేదు. అయితే ఎట్టకేలకు కాస్తంత ఎక్కువ గ్యాప్ తీసుకొన్నప్పటికీ.. ఇప్పుడు రెండో ప్రయత్నంలో పడ్డారు . ప్రస్తుతం ఓ ముగ్గురు టాలీవుడ్ డైరెక్టర్స్ .. తమ రెండో సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.
అర్జున్ రెడ్డి దర్శకుడికి సీతారామరాజు దొరికాడు
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో హీరోతో పాటు తానూ ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ కు ఉక్కిరిబిక్కిరి అయిపోయిన ఈ దర్శకుడికి.. దానికి తగ్గట్టుగానే ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయమని అతి పెద్ద ఆఫర్ వచ్చిపడింది. ‘కబీర్ సింగ్’ గా బాలీవుడ్ లో తెరకెక్కించిన ఆ సినిమాకి.. ‘అర్జున్ రెడ్డి’ కన్నా ఎక్కువగా క్రేజ్ వచ్చింది. షాహిద్ కపూర్, కియారా అద్వానీతో సేమ్ మ్యాజిక్ ను బాలీవుడ్ లోనూ రిపీట్ చేశాడు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ కు మరో బాలీవుడ్ ఆఫర్వ చ్చినప్పటికీ.. తెలుగులో రెండో సినిమా తీయాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ ను ప్రస్తుతం హోల్డ్ లో పెట్టుకున్నాడు. ఇటీవల రామ్ చరణ్ కు సందీప్ రెడ్డి.. ఒక క్రేజీ స్టోరీ లైన్ చెప్పాడట. చెర్రీకి ఆ స్టోరీ బాగా నచ్చిందట. నిజానికి మహేశ్ బాబుతో ఓ సినిమా తీయాలనుకున్నప్పటికీ అది వర్కవుట్ కాలేదు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ మరే సినిమాకీ కమిట్ అవకపోవడంతో… సందీప్ రెడ్డి సినిమానే చరణ్ పట్టాలెక్కించే ఉద్దేశంలో ఉన్నాడని టాక్.
శర్వానంద్ తో ‘ఆర్.ఎక్స్ 100’ దర్శకుడు
‘ఆర్.ఎక్స్ 100’ సినిమాతో సెన్సేషనల్ హిట్టు అందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ కు అతడు ఈ పాటికే మరో సినిమా తెరకెక్కించాలి లెక్క ప్రకారం. అయితే రెండో సినిమాకి కథ రెడీ అయినప్పటికీ.. హీరోని సెట్ చేసుకోవడంలో చాలా ఆలస్యం చేశాడు అజయ్ . నిజానికి తన రెండో ప్రాజెక్ట్ కోసం రాసుకున్న కథను ముందుగా నాగచైతన్యకి వినిపించగా… అతడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. అలాగే.. ఆ తర్వాత రవితేజను సంప్రదించినా.. వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు ఈ సినిమాకి శర్వానంద్ హీరోగా ఫైనలైజ్ అయ్యాడు. సినిమాకి మహాసముద్రం అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసుకున్నాడు. అలాగే.. తమిళ హీరో సిథ్ధార్థ ని కూడా ఇందులో మరో హీరోగా ఎంపిక చేశాడట అజయ్ భూపతి. ఇటీవలే అనౌన్స్ అయిన మహాసముద్రం సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనుంది.
బౌంటీ హంటిగ్ థ్రిల్లర్ తో ఏజెంట్ ఆత్రేయ దర్శకుడు
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో టాలీవుడ్ లో బ్రిలియంట్ డైరెక్టర్ గా ముద్ర వేయించుకున్నాడు.. కొత్త కుర్రోడు స్వరూప్ ఆర్.యస్.జే. తొలి సినిమాకే అదిరిపోయే గ్రిప్పింగ్ థ్రిల్లర్ ను ఎంపికచేసుకున్నఈ దర్శకుడు.. ఈ సినిమా విడుదలై.. 1 సంవత్సరం దాటిపోయినా.. ఇంతవరకూ రెండో సినిమానే మొదలుపెట్టలేదు. ఎట్టకేలకు ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ కూడా ఇప్పుడు రెండో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళే సన్నాహాల్లో ఉన్నాడు. ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టకపోయినా.. ఇటీవల ఒక ఆకర్షణీయమైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో తన రెండో సినిమా జోనర్ ఏంటో చెప్పాడు. మొదటి సినిమా కోసం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను తెరకెక్కించిన స్వరూప్ .. రెండో సినిమాకి బౌంటీ హంటింగ్ థ్రిల్లర్ ను ఫిక్స్ చేసుకున్నాడు. తిరుపతి నేపథ్యంలో సాగే ఒక క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. సో.. లేటయినప్పటికీ ఈ ముగ్గురు దర్శకులూ.. రెండో సినిమాతో లేటెస్ట్ గా రానున్నారన్నమాట.











