ఏపీలో రేషన్ డీలర్లు బందుకు దిగారు. వాహనదారులు ఇంటింటికి రేషన్ సరఫరా చేయలేమని చేతులెత్తేయడంతో, రేషన్ పంపిణీ చేయాలని అధికారులు రేషన్ డీలర్లపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని,ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తాము రేషన్ సరఫరా చేయలేమని రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది.తమను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి రేషన్ డీలర్లకు, వారి కుటుంబ సభ్యలందరికీ వెంటనే కరోనా టీకాలు వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.తమ వద్ద నుంచి గోతాలను తక్కువ ధరకు ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తోందని, గతంలో తమకు ఖాళీ గోతాలు అమ్ముకోవడం ద్వారా కొంత ఆదాయం వచ్చేదని వారు గుర్తు చేశారు.
బతికేదెలా..
ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రేషన్ డోర్ డెలివరీ విధానంతో తమ ఆదాయం దారుణంగా పడిపోయిందని, గతంలో రేషన్‌తో పాటు కొన్ని సరుకులు అమ్ముకోవడం ద్వారా కొంత ఆదాయం వచ్చేదని రేషన్ డీలర్లు గుర్తు చేస్తున్నారు.ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే కమిషన్ షాపుల అద్దెలకు కూడా చాలడం లేదని, కరోనా కారణంగా కేంద్రం ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని ఆదేశించిందని,వాటికి సంబంధించిన కమీషన్ కూడా రెండు నెలల వరకు రాదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికే ఏపీలో 150 మంది రేషన్ డీలర్లు కరోనా భారిన పడి చనిపోయారని, వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పరిహారం అందించాలనే డిమాండ్‌తో రేషన్ డీలర్లు బంద్ పాటిస్తున్నారు.ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంఘాలు ప్రభుత్వానికి విజ్ఙప్తి చేస్తున్నాయి.