వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇళ్లకే పరిమితం అయిన నేతల్లో గుడివాడ అమర్ నాథ్ కూడా ఒకరు. అప్పట్లో జగన్ ను ఎవరైనా ఏమైనా అంటే, పెద్ద మేధావి తరహాలో మీడియా ముందుకు వచ్చి తన తెలివితక్కువ తనం బయటపెట్టుకునేవారు. అలా ఎన్నోసార్లు నవ్వులపాలు అయ్యారు. ఇలా ప్రస్తుతం విశాఖ జిల్లా నుంచి వైసీపీలో కీలకంగా కొనసాగుతున్న మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఇటీవల మరీ మౌనంగా ఉంటున్నారు. విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయనగరం నుంచి మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరును పార్టీ ప్రకటించిన నేపథ్యంలో గుడివాడ అమర్‌నాథ్ పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారనే ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికకు సంబంధించి తాడేపల్లిలో పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఆయన ఆ తర్వాత కనిపించలేదు. గుడివాడ అమర్‌నాథ్ స్వయంగా ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నా కూడా జగన్ ఆయన పేరును ఖరారు చేస్తారని బాగా నమ్మారు. అలా తనకే ఎమ్మెల్సీ టికెట్ అని భావించారు. అయితే బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించడంపై గుడివాడ అమర్ వర్గం తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
ఇటీవలి రోజుల్లో గుడివాడ అమర్‌నాథ్ మీడియా ముందుకు రాకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు. అయితే, ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా, ఈ కీలక నేత తన బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూడటం హాట్‌టాపిక్ అవుతోంది. పైగా పార్టీకి కీలకమైన ఎన్నిక సమయంలో గుడివాడ అమర్‌నాథ్ విదేశీ పర్యటనకు వెళ్లిపోయారని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఈ స్థానంలో వైసీపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నా, అధికార పార్టీ వ్యూహాల కారణంగా అది వైసీపీ చేజారిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పటికే ఎంతో మంది ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు గోడలు దూకి కూటమి పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. ఇలాంటి వారిని గుర్తించి అడ్డుకోవాల్సిన మాజీ మంత్రి తనకే సంబంధం లేనట్లు వ్యవహరించడంపై జగన్ కు ఆందోళన కలుగుతోంది. ఇలా కీలక నేతలు ఉద్దేశ పూర్వకంగానే పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్న విషయం స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో జగన్ ను గుడివాడ అమర్ నాథ్ వ్యవహారం కంగారు పుట్టిస్తోందని అంటున్నారు. అంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు వైసీపీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది.











