ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా నెల్లూరులో మాత్రం పెద్దారెడ్లదే పెత్తనం. ఏ పార్టీలో అయినా నెల్లూరు జిల్లా నుంచి పెద్దారెడ్లకు పెద్ద పీట తప్పనిసరి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక నెల్లూరు పెద్దరెడ్ల హవాకు కొంతకాలం బ్రేక్ పడింది. వైసీపీ నుంచి గెలచిన అనిల్ కుమార్ యాదవ్‌కు కీలక మంత్రి పదవి అప్పగించడంతో చాలా రోజులు నెల్లూరు పెద్దారెడ్లు సైలెంట్ అయ్యారు. గత కొంత కాలంగా మంత్రి అనిల్ హవా నడవడం లేదట. ఆయన మాట వైసీపీలో ఎవరూ వినడం లేదని తెలుస్తోంది. పైగా ఏదైనా గట్టిగా చెబితే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తున్నారట. దీంతో మంత్రి అనిల్ జిల్లాలో వైసీపీ వ్యవహారాలు పట్టించుకోవడం మానేశారని తెలుస్తోంది.
మాదారికి అడ్డు రావద్దు
నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు క్యాబినెట్‌లో ఉన్నారు. ఒకరు అనిల్ కుమార్ యాదవ్ కాగా, మరొకరు మేకపాటి గౌతమ్‌రెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మంత్రి అనిల్ యాదవ్ అంతా తానై చక్రం తిప్పారు. నెల్లూరు వైసీపీ అంటే తానే అన్నట్టు వ్యవహరించారు. ఒకటిన్నర సంవత్సరం గడచిపోయింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వైసీపీలో ఆయన మాటకు విలువలేకుండా పోయింది. ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్థన్‌రెడ్డి లాంటి నాయకులైతే అనిల్ యాదవ్ మాట లెక్క చేయడం లేదని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో జిల్లా వైసీపీ వ్యవహారాలను కూడా ఆపార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి అప్పగించారు. దీంతో ఇక అనిల్ యాదవ్‌కు జిల్లా రాజకీయాలతో పనిలేకుండా పోయిందట.
నాకు సంబంధం లేదు
ఇటీవల కాలంలో కాకాని గోవర్థన్ రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవన్నీ మంత్రి అనిల్ యాదవ్ దుష్రచారం చేయించారని కూడా ప్రచారం జరిగింది. ఈ విషయం గ్రహించిన మంత్రి అనిల్ యాదవ్, కాకానిపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, దాని వెనుక తన హస్తం ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన ఖండించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఖండనలను మంత్రి అనిల్ యాదవ్ ఇవ్వలేదు. నెల్లూరు పెద్దా రెడ్లతో పెట్టుకుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉండటంతోనే మంత్రి అనిల్ యాదవ్, కాకానిపై వచ్చిన ఆరోపణలు ఖండించారని తెలుస్తోంది.
ఆయన మాటంటే లెక్కేలేదు
నెల్లూరు జిల్లా మంత్రి అనిల్ యాదవ్‌ను జిల్లా రెడ్లు దూరం పెట్టారని తెలుస్తోంది. జిల్లా వైసీపీలో ఆయన మాట వినేనాధుడే లేడట. దీంతో విషయం అనిల్ యాదవ్‌కు కూడా అర్థం అయిందట. అందుకే జిల్లా వైసీపీ వ్యవహారాల్లో వేలు పెట్టడం లేదని సమాచారం. నెల్లూరు పెద్దా రెడ్లకు చెప్పినా తనమాట వినరని మంత్రి అనిల్ యాదవ్‌కు అర్థం కావడంతో ఇక ఆయన పని ఆయన చేసుకుపోతున్నారని వినికిడి. జలవనరుల మంత్రిత్వ శాఖకు చెందిన అంశాలు తప్ప మంత్రి అనిల్ వేరే విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. నెల్లూరు జిల్లా వైసీపీలో పెద్దారెడ్ల మధ్యే సఖ్యత సరిగా లేదు. ఇక బీసీ నేతలను పెత్తనం ఎలా చేయనిస్తారు. నెల్లూరు జిల్లాలో సరిగ్గా అదే జరుగుతోంది మరి.











