‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ..’ ఈ డైలాగ్ ఎంత పాపులరో మనకు తెలియంది కాదు. బ్లాక్ బస్టర్ మూవీ ‘బొమ్మరిల్లు’ను ఎవరు మరచిపోతారు. కానీ హిందీలో రీమేక్ అయినా ఈ సినిమాని అందరూ మరచిపోయారు. దీన్ని ‘ఇట్స్ మై లైఫ్’పేరుతో 2007లోనే తెరకెక్కించారు. అనీస్ బజ్మీ దర్శకత్వంలో బోనీకపూర్, సంజయ్ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ఇప్పటికి మోక్షం లభించింది. దీన్ని ఈ నెల 29న జీ సినిమాలో డైరెక్టుగా ప్రసారం చేయబోతున్నారు.
ఇందులో సిద్ధార్థ్ పోషించిన పాత్రను హర్మన్ బవేజా పోషించగా, జెనీలియా పోషించిన హాసిని పాత్రను హిందీలో కూడా ఆమే పోషించింది. ప్రకాష్ రాజ్ పాత్రను నానా పటేకర్ పోషించారు. తండ్రీ కొడుకుల కథాంశం ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమాకు శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం సమకూర్చారు.
ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో ఎవరికీ తెలియదుగానీ విడుదల చేయడానికి మాత్రం 13 ఏళ్లు పట్టింది. ఈ సినిమా విజయం మీద అటు నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు అనీస్ బజ్మీ చాలా ఆశలు పెట్టుకున్నారు. మంచి వినాదాత్మకంగా దీన్ని మలిచినట్టు అనీస్ బజ్మీ చెబుతున్నారు. మరి దీనికి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.