ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల ఎన్రోల్‌మెంట్ అత్యంత వేగంగా జరుగుతోంది. పార్టీలన్నీ ఈ ప్రాసెస్ పైనే కాన్సన్‌ట్రేట్ చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గల్లి గల్లీకి తిరుగుతూ గ్యాడ్యుయేట్లను పట్టుకునే పనిలో పడ్డాయి. తనకు తెలిసిన వారితో పాటు వారి స్నేహితులు, బంధువులు ఇలా తీగ లాగుతూ పోతున్నారు. వీలైనన్ని ఎక్కువ ఎన్రోల్ మెంట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైతే నేరుగా వెళ్ళి కలవడం .. లేదంటే ఫోన్‌లో సంప్రదించి ఎన్రోల్ మెంట్ చేసుకున్నారా అంటూ రెండు మూడు సార్లు కనుక్కుంటున్నారు. ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తూనే , తామేమైనా సాయం చేయాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎంత ఎన్రోల్‌మెంట్ చేసుకుంటే అన్ని ఓట్లు తమకే దక్కుతాయన్న భావనలో పార్టీలు, అబ్యర్థులు ఉన్నారు.
ఆన్ లైన్‌లో అప్లై చేసుకునేందుకే మొగ్గు..
ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులు చేస్తున్న అభ్యర్థనకు గ్యాడ్యుయేట్లు చెక్ చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన వెబ్ సైట్ లో ఆన్‌లైన్ లోనే దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఎన్రోల్‌మెంట్ కోసం క్షేత్ర స్థాయికి వెళ్తున్న అభ్యర్థులకు గ్యాడ్యుయేట్ల నుండి పెద్దగా స్పందన రావడం లేదు. మెహమాటానికి తావు లేకుండా తమ వద్దకు వస్తున్న వారికి తాము ఆన్‌లైన్ లోనే ఓటర్‌గా నమోదు చేసుకుంటున్నామని చెబుతున్నట్టు బరిలో ఉన్న అభ్యర్థులు అంటున్నారు. దీంతో ఎన్రోల్ మెంట్ కోసం ఓటర్ల దగ్గరకు వెళ్ళిన తాము కేవలం ప్రచారం మాత్రమే చేసుకుంటున్నామంటున్నారు. ఈజీగా ఫాంలు సబ్మిట్ చేసేలా సాఫ్ట్‌వేర్ ఉండటంతో అంతా ఆన్‌లైన్ లోనే ఓటరుగా నమోదు చేసుకుంటున్నారు..
ఎవరి చేతిలో తమ ఓటు ఉండకూడదనే..
గ్యాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికలంటే గతంలో ఎన్రోల్‌మెంట్ చూసే పోటీలో ఉండాలో, వద్దో నిర్ణయించుకునే వారు అభ్యర్థులు. అయితే ఇదంతా గతం అంటున్నారు గ్రాడ్యుయేట్లు. ఓటరు దరఖాస్తు కోసం తమను కలవాల్సిన పనిలేదంటున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ , లేదా ఇంట్లో ల్యాప్ టాప్ , కంప్యూటర్ ఇలా ఏదో ఒకటి ఉంటోంది. ఇంటర్ నెట్ ఇక కామన్ . దీంతో ఖాళీ సమయంలో ఓటర్‌గా నమోదు చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో ఎన్నడూ నమోదు చేసుకోని వారు సైతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసుకుంటున్నారు. ఇలా దాదాపు 70 శాతం మంది గ్రాడ్యుయేట్లు ఆన్‌లైన్ లోనే ఓటరుగా నమోదు చేసుకున్నారంటున్నారు. కేవలం మిగిలిన ముప్పై శాతం మంది మాత్రమే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో ఏ అభ్యర్ది ఎంత ఎన్రోల్ చేశారు… చివరికి ఎంత మంది బరిలో ఉంటారన్నది తరువాతే తేలనుంది.