హీరోలంతా ఒక్కరొక్కరుగా షూటింగులకు కదులుతుంటే విక్టరీ వెంకటేష్ ఎందుకు ఊరుకుంటారు.. నారప్ప షూటింగులో దిగిపోయారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తమిళంలో విజయవంతమైన అసురన్ కు రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. నారప్పగా వెంకీ నటిస్తున్న ఈ చిత్రంలో సుందరమ్మగా ప్రియమణి నటిస్తోంది. లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా 60 రోజుల షూటింగును పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలో కొంత షూటింగ్ చేశారు. అలాగే తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో మరికొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ప్రస్తుతం ప్రియమణి, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో 80 శాతం షూటింగు పూర్తవుతుందని నిర్మాతల్లో ఒకరైన కలైపులి థాను తెలిపారు. దీనికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మంచి విజయం కోసం కష్టపడుతున్నారు. త్వరలోనే ఈ సినిమాని విడుదల చేయాలనే లక్ష్యంతో నిర్మాతలు ఉన్నారు. సంక్రాంతి బరిలో మాత్రం ఈ సినిమా ఉండే అవకాశం లేదు.