తెలుగులో రీమేక్స్ ఎక్కువగా చేసిన హీరోలు వెంకటేష్ , పవన్ కళ్యాణ్ అనుకుంటారు . కానీ రీమేక్స్ లో మెగాస్టార్ చిరంజీవి తక్కువేమీ కాదు . ఈ మధ్య కాలంలో చిరంజీవి ‘ లూసిఫర్’ , ‘వేదాళం’ రీమేక్ చేయబోతున్నారనే వార్తలు వచ్చినప్పుడు అభిమానులు కంగారు పడ్డారు . ఎప్పుడూలేనిది మన హీరో ఇప్పుడు రీమేక్స్ వెనుక పడుతున్నారేంటి అనుకున్నారు . కానీ చిరంజీవి తొలిదశ నుంచి కూడా ఇలాంటి సినిమాలు చేస్తూ వచ్చారు. తన151 సినిమాల్లో ఆరో వంతు అంటే దాదాపు 23 సినిమాలకు పైగా రీమేక్ చేశారు .
చిరంజీవి రెండో చిత్రం ( విడుదల పరంగా ) బాపు ‘ మన ఊరి పాండవులు ‘ పుట్టన్న కన్నడ చిత్రానికి రీమేక్ . కె. బాలచందర్ ‘ ఇది కథ కాదు ‘ చిత్రాన్ని ముందు తమిళంలో తీసి తర్వాత తెలుగు లో తీశారు . ‘ప్రేమ తరంగాలు’ అనే సినిమా హిందీ ‘ ముకద్దర్ కా సికిందర్ ‘ ఆధారంగా తీశారు. ‘ ప్రియ ‘ అనే సినిమా తమిళంలో భారతి రాజా తీసిన సినిమా ఇక చిరంజీవి కెరీర్ లోనే ఏడాది ఆడిన మొదటి సినిమా కట్టా సుబ్బారావు డైరెక్షన్లో తమ్మారెడ్డి భరద్వాజ తీసిన ‘మొగుడు కావాలి’. ఇది హిందీ సినిమాకి రీమేక్ .
జ్వాల , చక్రవర్తి ,ఎస్పీ పరశురామ్ .. ఇవన్నీ తమిళ సినిమాల రీమేక్స్. చిరంజీవి కెరీర్ లో మరచిపోలేని ‘ విజేత ‘ సినిమా హిందీలో అనిల్ కపూర్ చేసిన ‘ సాహెబ్’కి రీమేక్ . బ్లాక్ బస్టర్ ‘ ఘరానా మొగుడు ‘ తమిళం లో రజనీ కాంత్ చేసిన సినిమాకి రీమేక్ . ‘ మగ ధీరుడు ‘ , ఖైదీ నెంబర్ 786 , ” దేవాంతకుడు ” , ” ప్రేమ పిచ్చోళ్ళు’ , త్రినేత్రు డు , మంత్రి గారి వియ్యంకుడు , ” హిట్లర్ , స్నేహం కోసం ,ఠాగూర్ , శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీ నెంబర్ 150 .. ఇవన్నీ కూడా పర భాషా చిత్రాల నుంచి తెలుగులో రీమేక్ అయినవే. సో .. రీమేక్స్ లో చిరంజీవి జడ్జిమెంట్ అధిక శాతం సక్సెస్ అయినవే ! మరి ” లూసిఫర్” , ‘ వేదాళం ‘ రీమేక్స్ మీద అభిమానులు ఆశలు పెట్టుకోవచ్చు .











