సముద్రాన్ని మధిస్తే అమృతం పుట్టినట్టు మనం పురాణ కథల్లో చదివాం… ఇప్పుడు మంచినీరు వస్తుందని మన నేతలంటున్నారు. మనచుట్టూ సముద్రమే… కానీ తాగడానికి చుక్క నీరు దొరకదు… అనే మాటలు మనం ఎన్నోసార్లు విన్నాం. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చేమోగాని సముద్రపు నీటిని మంచినీటిగా మార్చడం సాధ్యమవుతుందా? అన్నదే ప్రశ్న. దీనికి అయ్యే ఖర్చు ఎంత? వేరే ప్రత్యేమ్నాయ మార్గాలు లేవా? ఈ తరహా ప్రాజెక్టులు విజయవంతమయ్యాయా?… ఇవన్నీ మనముందున్న ప్రశ్నలు. ఈ అంశాలన్నీ తెరమీదికి రావడానికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో ఈ ప్రాజెక్టు చేపట్టాలని ఆలోచిస్తుండటమే. దీన్నే డీశాలినేషన్ ప్లాంట్ అంటారు. దీని కోసం గట్టి ప్రయత్నాలే సాగుతున్నాయి.
ఈ ప్రాజెక్టు ఆచరణలోకి వచ్చేముందు కొన్ని లోటు పాట్లను చర్చించాల్సి ఉంది కాబట్టే ఈ విశ్లేషణ. సముద్రపు నీరు తాగునీరుగా మారితే నీటి కష్టాలు ఉండవన్నది కొందరి వాదన. ఇప్పటిదాకా మనం నదీ జలాల మీదే ఆధారపడుతున్నాం. ఇప్పుడు సముద్రం మీద కూడా ఆధారపడాల్సి వస్తోంది. విశాఖ నగరం తాజాగా పరిపాలన రాజధానిగా మారబోతోంది కాబట్టి ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందని అనుకోవచ్చు. ఇప్పటికే విశాఖ మెట్రో సిటీగా ఎదిగింది. నగరం విస్తరిస్తున్న ఈ తరుణంలో పరిశ్రమలకు, వ్యవసాయానికి, ప్రజల తాగు నీటికి కూడా చాలానీరు కావాలి. దానికి ఇది ఓ ప్రత్యామ్నాయ ప్రణాళిక.
20 ఏళ్లలో విశాఖ ఎంత పెరిగింది?
2001లో 8.5 లక్షలున్న విశాఖ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 17.28 లక్షలకు పెరిగింది. అంటే పదేళ్లలోనే జనాభా రెట్టింపైందన్నమాట. 2011 నుంచి ఇప్పటిదాకా 21 లక్షలకు పైనే విశాఖ జనాభా ఉంటుందని అంచనా. చుట్టుపక్కల గ్రామాల విలీనంతో విశాఖ మహానగరం మారింది. ఇక్కడ ఉన్న జనాభానే కాకుండా నిత్యం ఇక్కడికి వచ్చిపోయేవారు లక్షమంది వరకూ ఉంటారు. రాజధానిగా మారితే ఇప్పుడు ఈ లక్కలన్నీ మారిపోతాయి. విశాఖ నగరం నీటి అవసరాలను ఏలేరు రిజర్వాయరు తీరుస్తోంది.
వంద ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే)ల నీరు విశాఖకు వస్తోంది. ఇందులో నుంచే పరిశ్రమలకు, తాగడానికి నీటిని అందిస్తున్నారు. ఒక్క విశాఖ ఉక్కు పరిశ్రమే 40 ఎంజీడీల నీరు, ఎన్టీపీసీ 10 జీఎండీల నీరు తీసుకుంటున్నాయి. ఇక రైవాడ నుంచి 16, మేఘాద్రి గడ్డ నుంచి 10, తాటిపూడి పథకం నుంచి 10, గంభీరం, ముడసర్లోవ నుంచి నాలుగు ఎంజీడీల చొప్పున నీరు విశాఖ తాగునీటి అవసరాల కోసం వస్తోంది. ఇన్ని చోట్ల నుంచి నీరు వస్తున్నట్టు ఉన్నా ఏటా విశాఖకు నీటి కష్టాలు తప్పడం లేదు.
ఉప్పు నీటి శుద్ధి సాధ్యాసాధ్యాలు
సముద్రపు నీటిని తాగు నీటిగా మార్చగలిగితే నిజానికి నీటి కష్టాలే ఉండవు. ఉప్పు నీటిని శుద్ది చెయ్యడం అనేది ఖరీదుతో కూడుకున్న పని . ఇంతకుముందు మద్రాసులో దీన్ని చేపట్టినా సత్ఫలితాలు రాలేదు. చెన్నై ప్రజల దాహార్తిని తీర్చేందుకు మహాబలిపురం సమీపంలో అలాంటి ప్లాంటు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రాజెక్టులకు అందరూ ఇజ్రాయిల్ మీద ఆధారపడుతుంటారు. ఇప్పుడు ఏపీ కూడా ఇజ్రాయిల్ తోనే కలసి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టబోతోంది. డిశాలినేషన్ అంటే సముద్రపు నీటి నుంచి లవణాలను తొలగించి ఆ నీటిని తాగేందుకు అనువుగా మార్చడం. నీళ్ల కోసం సింగపూర్ ప్రభుత్వం అత్యధికంగా ఖర్చు చేసేది ఈ ప్రాజెక్టు కోసమే. ప్రస్తుతం సింగపూర్ నీటి అవసరాలను 30 శాతం వరకు ఈ ప్లాంట్లే తీరుస్తున్నాయి.
ఇజ్రాయెల్ ఏంచేసింది?
88 లక్షల జనాభా కలిగిన ఈ దేశం ఇజ్రాయెల్. ఇక్కడ కేవలం 10శాతం భూభాగం మాత్రమే ప్రజలకు నివాసయోగ్యంగా ఉంటుంది. ఇక్కడ మంచినీరే ప్రధాన సమస్య. అందుకోసమే సముద్రపు నీటిని ఉప్పునీటిగా మార్చాలన్న ఆలోచన వీరికి వచ్చింది. దాన్ని ఆచరణలో పెట్టారు. ప్రకృతి ప్రసాదించే నీటిని చక్కగా వినియోగించుకోవాలంటే టెక్నాలజీ ఒక్కటే సరిపోదని వారికి ఆ తర్వాత అర్ధమైంది. ఒకప్పుడు నీటి వినియోగంలో ప్రపంచదేశాలకు పాఠాలు నేర్పిన ఇజ్రాయెల్ ఇప్పుడు నీటిని పొదుపుగా వాడుకోకపోతే తలెత్తే పరిణామాల గురించి గుణపాఠం నేర్పుతోంది. ఇజ్రాయిల్ విధానం ద్వారా నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టుకు ఖర్చు బాగా ఎక్కువ. విద్యుత్ ఖర్చులు తడిసిమోపెడవుతాయి.
మనం ఏంచేస్తే మంచిది?
సముద్రపు నీటిని ఉప్పునీటిగా మార్చడం వల్ల ఆ నీరు పరిశ్రమలకు తప్ప తాగడానికి పనికిరాదు. దానికన్నా పోలవరం నీటిని మళ్లించి విశాఖ తాగునీటి అవసరాలను తీర్చుకోవచ్చు. అలాగే వర్షాకాలంలో నీరు వృధాగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. ఆ నీటిని నిల్వ చేసుకోగలిగే సామర్థ్యం మనకు ఉంటే కొత్త ప్రాజెక్టుల అవసరం ఉండదు. ఈ నీటి అవసరాలకు ఏకైక పరిష్కార మార్గం పోలవరం ఎగువ కాలువ నుంచి నీటిని తీసుకోవడం. వర్షాలు పడకపోతే మాత్రం విశాఖకు నీటి ఇబ్బందులు తప్పకపోవచ్చు.










