ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఓ కొత్త లుక్కులో కనిపించారు. పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా ఆయన మెడలో కొత్తగా ఐడెంటిటీ కార్డు కనిపించింది. అంతేకాదండోయ్… జగన్ తో పాటు సమావేశానికి హాజరైన నేతలు, సోసల్ మీడియా ప్రతినిధులు అందరి మెడల్లోనూ వైసీపీ ఐడీ కార్డులు కనిపించాయి. చివరకు సమావేశానికి హాజరైన మహిళా నేతలు కూడా ఐడీ కార్డులతోనే మెరిసిపోయారు. అయినా వైసీపీ ఆవిర్భవించి ఏళ్లు గడుస్తున్నా.. ఇలా ఓ సమావేశంలో ఆ పార్టీకి చెందిన నేతలంతా ఇలా ఐడీ కార్డులతో కనిపించడం ఇదే మొదటిసారి. ఎప్పుడు పార్టీ సమావేశాలు జరిగినా… ఏ ఒక్కరూ ఐడీ కార్డును ధరించిన పాపాన పోలేదు. అయిలు తమ పార్టీ నేతలకు వైసీపీ ఇప్పటిదాకా ఐడీ కార్డులు ఇవ్లేదని కూడా చెప్పవచ్చు. పార్టీ ప్లీనరీల్లోనూ ఈ తరహా సంస్కృతి కనిపించిన దాఖలా లేదు.
అదే టీడీపీ విషయానికి వస్తే…ఆది నుంచి పార్టీ సమావేశాలకు హాజరయ్యే నేతలు తప్పనిసరిగా ఐడీ కార్డులను ధరించి కనిపిస్తారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పార్టీ వ్యవహారాల్లోకి ప్రవేశించాక ఈ సంస్కృతి మరింతగా పెరిగింది. పార్టీ అధినేత నుంచి కింది స్థాయి గ్రామ కార్యకర్త వరకూ ప్రతి ఒక్కరికీ పార్టీ గుర్తింపు కార్డులు జారీ అవుతూ ఉంటాయి. సభ్యత్వ నమోదు సమయంలోనే ఈ గుర్తింపు కార్డులను పార్టీ అధిష్ఠానం పార్టీ శ్రేణులకు అందజేస్తూ ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలను పక్కనపెడితే… పార్టీకి సంబంధించి ఎంత చిన్న కార్యక్రమమైనా, ఎంత పెద్ద కార్యక్రమం అయినా ప్రతి నేత మెడలో ఐడీ కార్డు తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఐడీ కార్డులను టీడీపీ శ్రేణులు తమకు దక్కిన గౌరవంగా భావిస్తారు. అంతేనా ఈ కార్డులు కలిగిన ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమాను కూడా అందించి లోకేశ్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.
టీడీపీ మొదలుపెట్టిన ఈ సంస్కృతి ఇప్పుడు వైసీపీలోనూ కనిపిస్తూ ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్ మెడలో ఐడీ కార్డులను చూసిన ప్రతి ఒక్కరూ… లోకేశ్ ను జగన్ కాపీ కొట్టేశారని, లోకేశ్ అడుగు జాడల్లో జగన్ నడుస్తున్నారని, టీడీపీ క్రమశిక్షణను వైసీపీలోనూ అలవాటు చేయాలని జగన్ నిర్ణయించారని… ఇలా రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మెడలో ఐడీ కార్డు వేసుకుని జగన్ ప్రసంగిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ పోస్టులపై టీడీపీ, వైసీపీ శ్రేణులతో పాటు సామాన్య జనం కూడా ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నేపథ్యంలో పార్టీలో క్రమశిక్షణ అలవర్చాలన్న భావనతోనే ఈ కొత్త ఐడీ కార్డుల కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే… మెడలో ఐడీ కార్డుతో జగన్ సరికొత్తగా కనిపిస్తూ ఉంటే… వైసీపీకి చెందిన కీలక నేతలంతా బుద్ధిగా మెడల్లో ఐడీ కార్డులేసుకుని కూర్చున్న దృశ్యాలు అమితాసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇలా ఐడీ కార్డులను మెడలో వేసుకుని సరికొత్తగా కనిపిస్తున్న వారిలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరింత ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. తెలుపు రంగు చొక్కా లేదంటే… అయ్యప్ప మాలలో కనిపించే పెద్దిరెడ్డి మెడలో ఐడీ కార్డు విచిత్రంగా కనిపిస్తోంది. ఇక బక్క రైతుగా కనిపించే ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మెడలో ఐడీ కార్డుతో మరింత కొత్తగా కనిపిస్తున్నారు.
ఇక వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా స్కూలు పిల్లాడి మాదిరిగా మెడలో ఐడీ కార్డు వేసుకుని జగన్ చెప్పే మాటలను బుద్ధిగా వింటూ కనిపించారు. ఇక వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,కురసాల కన్నబాబు, ఉషాశ్రీ చరణ్.. ఇలా అంతా ఐడీ కార్డులు ధరించారు. సమావేశానికి హాజరైన వారంతా ఐడీ కార్డులతో కనిపించినా… సాయిరెడ్డి పక్కనే కూర్చున్న జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి మాత్రం ఐడీ కార్డు లేకుండా బోసి మెడతో కనిపించడం గమనార్హం.