ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటుగా ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… ఇలా ఒకరేమిటి? ఎవరిని పడితే వారిని బండబూతులు తిడుతూ సాగిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారం విపక్ష వైసీపీ మెడకు చుట్టుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. రిపబ్లికన్ పార్టీ ఆప్ ఇండియాకు ఏపీ అధ్యక్షుడినని చెప్పుకునే అనిల్… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానమున్నట్లు వ్యవహరించేవారు.
సీఎంగా ఉన్న జగన్ కను సైగ చేస్తే… చంద్రబాబుతో పాటు లోకేశ్ ను కేవలం గంట వ్యవధిలో చంపేస్తానని కూడా అతడు గతంలో సంచలన కామెంట్లు చేశాడు. నేతలను దూషించడంతోనే సరిపెట్టుకోని అనిల్… వారి కుటుంబ సభ్యులను, ప్రత్యేకించి మహిళలను కూడా ఇష్టారాజ్యంగా ఆడిపోసుకునేవాడు. అయితే ఓ కేసులో గురువారం అరెస్టైన అనిల్… రాత్రికి రాత్రే తన తప్పును ఒప్పుకున్నాడు.అంతేకాకుండా తనను ఈ దిశగా ప్రోత్సహించింది వైసీపీ నేతలేనని కూడా అతడు పోలీసులకుచెప్పినట్లు సమాచారం.
జగన్ పార్టీకి వైరివర్గాల్లోనే నేతలను టార్గెట్ చేసుకుని రెచ్చిపోయిన అనిల్… పలువురు వ్యక్తులపై బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో అతడిపై ఇదివరకే గుంటూరు పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. రూ.50 లక్షలివ్వాలంటూ ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో అనిల్ ను అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపరచగా… న్యాయమూర్తి అతడికి రిమాండ్ విధించారు. దీంతో అతడిని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు పోలీసుల ల విచారణలో భాగంగా అనిల్ పలు కీలక అంశాలను ఒప్పుకున్నట్లు సమాచారం. అనిల్ నోట నుంచి వచ్చిన ఈ అంశాలు వైసీపీ నేతలను బెంబేలెత్తిస్తున్నాయని చెప్పిక తప్పదు.
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం సహా తాను దూసించిన వారందరి పేర్లను వైసీపీనే తనకు ఇచ్చిందని అనిల్ పోలీసులకు తెలిపాడు. అంతేకాకుండా వైసీపీ నేతలు ఆదేశాలు జారీ చేస్తేనే తాను తిట్ల దండకం అందుకున్నానని కూడా అతడు తెలిపాడు. విపక్ష నేతలపై దూషణలు చేసిన తర్వాత ఏమైని ఇబ్బంది వస్తే తాము అండగా ఉంటామని వైసీపీ నేతలు తనకు భరోసా ఇచ్చారని కూడా అతడు చెప్పాడు. ఇక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తాము చెప్పినట్లు నడుచుకుంటే.. మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా వైసీపీ నేతలు తనకు హామీ ఇచ్చారని తెలిపాడు. అయితే వైసీపీ నేతలు ఇప్పుడు పత్తా లేకుండా పోయారని అతడు వాపోయాడు.
వైసీపీ నేతలు లిస్టు ఇచ్చి… భరోసా ఇస్తేనే తాను ఆయా నేతలపై దూషణలకు దిగానని అనిల్ కుండబద్దలు కొట్టేశాడు. అయితే ఇప్పుడు తాను అరెస్ట్ అయితే… అండగా ఉంటామన్న ఒక్క వైసీపీ నేత కూడా కనిపించడం లేదని అతడు ఆరోపించాడు.తనను నమ్మంచి వైసీపీ నేతలు ముంచేశారని బావురుమన్నాడు. పనిలో పనిగా తనను తాను రక్షించుకునేందుకు సమాయత్తమైన అనిల్… తాను అప్రూవర్ గా మారతానంటూ పోలీసులకు తెలిపాడు. తాను దూషించిన నేతల వద్దకు వెళ్లి వాళ్ల కాళ్లపై పడి క్షమాపణ కోరతానని అతడు వెల్లడించాడు. మొత్తంగా అనిల్ అప్రూవర్ గా మారితే… చంద్రబాబు సహా ఇతర నేతలపై దూషణలతో విరుచుకుపడమని చెప్పిన వైసీపీ నేతల పేర్లు కూడాబయటకు రాక తప్పదు. ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో లాక్కోలేక, పీక్కోలేక సతమతమవుతున్న వైసీపీ నేతలకు అనిల్ కేసు మరింత చిక్కులను కొనితెచ్చినట్లేనని చెప్పక తప్పదు.