గత కొన్ని నెలలుగా బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తోంది. ఇదే డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఆమెకు కోర్ట్ బెయిల్ కూడా ఇచ్చింది. ఇదే కేసులో ఆమెతో పాటు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్ సింగ్ తదితురులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రముఖ హిందీ సీరియల్స్ నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ వినియోగం కేసులో అరెస్టయ్యారు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు ప్రీతికా చౌహాన్ తో పాటుగా మరో నలుగురిని అరెస్ట్ చేసారు. ప్రీతికా చౌహాన్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె వద్ద నుండి 99 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఆమెను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఆమెకు నవంబర్ 8వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వెంటనే ఆమెను పోలీసులు జైలుకు తరలించారు. ఆమెతో పాటుగా విక్రేత ఫైజల్ అనే వ్యక్తికి కూడా నవంబర్ 8వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.
ఈ కేసులో ఇంకా అనేకమంది అరెస్ట్ అవుతారని అధికారులు తెలిపారు. ప్రీతికా చౌహాన్ ను విచారించి పూర్తి వివరాలను రాబట్టి, ఆ వివరాలను కోర్టుకు తెలియజేస్తామని అధికారులు తెలిపారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్న చాలా మంది డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్లు పక్కా ఆధారాలు లభించినట్లు ఎన్సీబీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే వారికి కూడా నోటీసులు పంపించి విచారించనున్నట్లు సమాచారం. కాగా ప్రీతికా చౌహాన్ ‘జమీలా’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. ఆమె సినిమాలతో పాటుగా దేవోకి దేవ్ మహదేవ్, సంకట్ మోచన్ మహాబలి హనుమాన్, మా వైష్టోదేవీ, సంతోషీ దేవీ, సీఐడీ, సావ్‌ధాన్ ఇండియా వంటి పలు హిందీ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ లో ఇంకెంతమంది ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవుతారో చూడాలి మరి.