(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన నేతల పరిస్థితి దారుణంగా తయారైంది. చీరాల టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు మద్దాలి గిరితో పాటు మరికొందరు టీడీపీ సీనియర్ నేతలు గడచిన ఏడాది కాలంలో వైసీపీలో చేరిపోయారు. వైసీపీలో చేరే వారికి రెడ్ కార్పెట్ వేసి దగ్గురుండి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకువెళుతున్నారు.
వైసీపీ పార్టీ కండువా కప్పుకోవడానికి కొన్ని సమస్యలు ఉన్నా, ఆ రోజు నుంచి వారు వైసీపీ నాయకుల కింద లెక్క. వైసీపీ తీర్థం పుచ్చుకోవడం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేయడం ఒకే సారి జరిగిపోతున్నాయి. అలా వైసీపీలో చేరి బయటకు రాగానే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. అంటే వైసీపీలో చేరిన వారు చంద్రబాబును, లోకేష్ ను ఏమి తిట్టాలి? ఎలా తిట్టాలి అనే అంశాలు కూడా వారే క్లియర్ గా చెబుతున్నారని సమాచారం.
లోకల్ తలనొప్పితో విసిగిపోయిన వల్లభనేని వంశీ…
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి బలమైన నేతలు ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు, 2014లో వైసీపీ నుంచి ఓడిపోయిన అభ్యర్థి దుట్టా రామచంద్రరావుతోపాటు, 2019లో వైసీపీ నుంచి ఓటమి పాలైన యార్లగడ్డ వెంకట్రావు కూడా గట్టి నాయకులే. వారు వంశీ నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం లేదు. నాలుగు జిల్లా వైసీపీ ఇన్ఛార్జి వైవీ సుబ్బారెడ్డి ఈ ముగ్గురు నేతలను పిలిచి ఇప్పటికే మూడు సార్లు పంచాయతీ చేశారు. అప్పటికి సర్దుకుంటుంది, మరి కొన్ని రోజులకే గన్నవరంలో రాజకీయ మంటలు అంటుకుంటున్నాయి.
వీరి సమస్య పరిష్కరించలేక ఆ పార్టీ అధిష్టానం తలలు పట్టుకుంటున్నారు. ఒక సమయంలో ‘‘రాజకీయాలకు గుడ్ బై. ఇప్పటివరకూ సహకరించిన వారందరికీ ధన్యవాదాలు’ అంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్వయంగా ఆయన ఫేస్ బుక్ పేజీలో పెట్టారు. వర్గపోరు తట్టుకోలేకపోవడం. అధిష్టానం కూడా సహకరించకపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని సమాచారం.
టీడీపీని వీడి వైసీపీలో వంశీ చేరేందుకు ఆ పార్టీ పెద్దలు పెద్దపెద్ద హామీలు ఇచ్చారట. అందులో ఒక్కటి కూడా నెరవేరకపోవడంతోపాటు, ఒక్కసారి సీఎంను కలిపించమని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకున్నవారు లేరట. దీంతో వంశీ రాజకీయాలను వదిలేయాలనుకున్నారని జనం చెవులు కొరుక్కుంటున్నారు.
కరణంతో ఆమంచి అమీతుమీ
చీరాలలో కరణం బలరాం పరిస్థితి అధ్వానంగా తయారైంది. కరణం బలరాం స్థానికులు కాకపోయినా వైసీపీ నుంచి పోటీ చేసిన కృష్ణ మోహన్ పై తీవ్ర వ్యతిరేకత కారణంగా ఆయన అక్కడ నెగ్గగలిగారు. 2019 ఎన్నికల అనంతరం తనయుడు వెంకటేష్ తో కలసి సీఎం సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రిని కలవడానికి అనేక పర్యాయాలు ప్రయత్నించారట. కానీ ఆయనకు కనీసం అపాయింట్మెంట్ కూడా దక్కలేదని సమాచారం. దీంతో ఆనేత పార్టీ మారి తప్పు చేశామా అంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నారని తెలుస్తోంది. ఇటు అద్దంకిలో పట్టుకోల్పోయి, చీరాల నాన్ లోకల్ కావడంతో వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మద్దాలి గిరికి ప్యాకేజీ అందిందా?
టీడీపీని వీడి వైసీపీలో చేరిన నేతల్లో మద్దాలి గిరి కొంత సంతోషంగా ఉన్నారట. ఇక ఎలాగా గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసినా ఆయన గెలిచే పరిస్థితి లేదు. గుంటూరులో వారి సామాజిక వర్గ ఓటర్ల చాలా తక్కువ. గుంటూరు పశ్చిమలో కమ్మవారి ప్రాబల్యం ఎక్కువ. టీడీపీలో ఎవరు పోటీ చేసినా వారు ఓట్లు వేస్తారు. ఇక మద్దాలి గిరికి వైసీపీలో టికెట్ కూడా కష్టమే. అయితే గత ఎన్నికల్లో మద్దాల గిరి ఖర్చులన్నీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పెట్టుకున్నారట.
దీంతో గిరి సొంతగా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే ఎమ్మెల్యే అయిపోయారు. ఆర్థికంగా వెనుకబడిన గిరి వెంటనే వైసీపీ తీర్థం పుచ్చుకుని భారీ ప్యాకేజీ చేజిక్కించుకున్నారని వినికిడి. ఆయన పెద్దగా గుంటూరు నగరానికి చేసే పనులేమీ లేవు. కానీ ప్యాకేజీ పూర్తిగా ముట్టడంతో వైసీపీలో చేరిన తరవాత, రెండో సారి సీఎంను కలసిన ఏకైక నేతగా గిరి నిలిచారు.
శిద్దా సంగతి ఏమైంది?
ఇటీవల వైసీపీలో చేరిన ప్రకాశం జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వృత్తి రీత్యా వ్యాపారి. ముఖ్యంగా గ్రానైట్ వ్యాపారంలో 3 దశాబ్దాల అనుభవం వారి సొంతం. రాజకీయాలు చేసినా ఎవరినీ పెద్దగా విమర్శలు చేయరు. టీడీపీలో ఉండగా వైసీపీ ప్రభుత్వం, శిద్ధా గ్రానైట్ గనుల్లో అక్రమాలు జరిగాయంటూ రూ.300 కోట్ల పెనాల్టీ వేశారు. ఆయనకు వెంటనే విషయం అర్థమై వైసీపీలో చేరిపోయారు. అయితే టీడీపీలో ఉండగా శిద్దా రాఘవరావు ప్రకాశం జిల్లాను శాసించారు. నేడు పరిస్థితి నియోజకవర్గంలో కూడా రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. ఇక శిద్ధా రాఘవరావు వ్యాపారాలకే పరిమితం అవుతారని తెలుస్తోంది. ఏదైనా అవకాశం ఉంటే వారి సోదరులు రాజకీయాలు నెరపే అవకాశం ఉంది. వైసీపీలో పదవులు ఆశించి శిద్దా ఆ పార్టీలో చేరలేదు. కేవలం వ్యాపారం సజావుగా సాగించేందుకే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాబట్టి ఆయనకు పెద్దగా వచ్చిన నష్టం కూడా ఏమీ లేదనే చెప్పుకోవచ్చు.
వార్డు స్థాయికి దిగజారిన దేవినేని అవినాష్
టీడీపీ రాష్ట్ర యువత అధ్యక్షుడిగా ఓ వెలుగు వెలిగిన నేతల దేవినేని అవినాష్. విజయవాడ తూర్పులో మంచి పట్టున్న నేత. గత ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంచి పేరున్న నాయకుడు గద్దే రామ్మోహన్ కు తప్పనిసరిగా టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో అవినాష్ కు గుడివాడ టికెట్ కేటాయించారు. గుడివాడకు దేవినేని అవినాష్ నాన్ లోకల్ కావడంతో ఓటమి పాలయ్యారు.
తదనంతరం ఆయన వైసీపీలో చేరిపోయారు. దీనికి ప్రధాన కారణం… వివాదాస్పద స్థలంలో ఓ భారీ హోటల్‌ను దేవినేని కుటుంబం నిర్మించింది. దాని నిర్వహణకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడడంలో భాగంగా పార్టీ మారినట్లు ప్రచారం ఉంది. అందుకే దేవినేని అవినాష్ కు ఎలాంటి ప్యాకేజీలు, హామీలు లేకపోయినా వైసీపీలో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి వాలంటీర్ స్థాయికి దిగజారిపోయిందని టీడీపీ నేతలు జోకులు వేసుకుంటున్నారు.
ఒకప్పుడు ఎలా ఉండే నేత ఎలా అయిపోయారని సానుభూతి చూపిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి దేవినేనికి వైసీపీ నుంచి టికెట్ వస్తే రావచ్చు కానీ, టీడీపీ నేతల గద్దే రామ్మోహన్ ను ఓడించడం కష్టమే.
అందుకే వలసలు ఆగాయా?
టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేతలు అక్కడ కుదురుకోలేకపోవడం, అక్కడ వారికి ఇబ్బందిగా మారడంతో కొత్తగా టీడీపీ నుంచి వైసీపీలోకి రావాలనుకుంటున్న వారిని హెచ్చరిస్తున్నారట. మేమే తప్పుచేశాం. మీరు అలాంటి పని చేయవద్దని సలహాలిస్తున్నారట. అందుకే టీడీపీ నుంచి వైసీపీకి వలసలు ఆగాయని సమాచారం. పెద్దనాయకులు ఫిరాయించడం ఆగడానికి కారణం అదేగా కనిపిస్తోంది. ఒక కేటగిరీ నాయకులు మాత్రం ఇప్పటికీ పార్టీ మారుతున్నారు. అందుకే వైసీపీ నేతల పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించినా ఒక్క టీడీపీ నేతనూ వైసీపీలోకి తీసుకురాలేకపోతున్నారట. అందుకే వైసీపీ నేతలు టీడీపీలో వ్యాపారాలు చేసే వారిని బెదిరించే పనిలో పడ్డారు. అది కూడా పెద్దగా వర్కవుట్ అయినట్టు కనిపించడం లేదు. ఏది ఏమైనా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేతల తలరాతలు వచ్చే ఎన్నికల్లో తేలనున్నాయి.