(తిరుపతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ గడప తొక్కే సాధారణ ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. పలు సందర్భాలలో ఆర్థిక, రాజకీయ నేపథ్యం లేని ప్రజల పట్ల పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇష్టం వచ్చిన వారిని ఇష్టం వచ్చినట్లు కొట్టడం తమ హక్కుగా భావిస్తున్నారు. అప్పుడప్పుడు ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తగురీతిలో మార్పు కనిపించడంలేదు.
చట్టాల పట్ల సాధారణ ప్రజలు సైతం అవగాహన పెరుగుతున్నప్పటికీ ఆ స్రృహే లేకుండా పోలీసులు వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా వాల్మీకిపురం పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. తన భర్త మృతికి కారణమని భావిస్తున్న వ్యక్తులను అరెస్టు చేయాలని అడిగిన పాపానికి సదరు మహిళ, కేసు రాజీకి అంగీకరించడం లేదని పోలీసులు కొట్టడం పై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట న్యాయం కోసం ధర్నా చేశాయి.
అసలేం జరిగింది
వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామం సమీపంలోని కోట పల్లెకు చెందిన రవి (37) గత నెల 25వ తేదీ సాయంత్రం నుంచి కనిపించలేదు. మరుసటి రోజు వరకు ఎదురుచూసిన ఆయన భార్య రమా దేవి 27వ తేదీన వాల్మీకిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కనిపించకుండా పోయిన రోజు సాయంత్రం తన భర్తను స్థానికుడైన ధన శేఖర్ రెడ్డి తీసుకెళ్లాడని ఆమె పోలీసులకు తెలిపారు. అయితే 28వ తేదీన గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో రవి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, అక్కడే శవపరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత కేసులో తగిన పురోగతి లేదు.
పోలీసులపై ఆరోపణ
తన భర్త రవి మృతి చెందిన కేసులో రాజీ చేసుకోవాలని ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా కొట్టారని రమాదేవి ఆరోపిస్తున్నారు. మృతుని తల్లి రాజమ్మను సైతం బెదిరించారు. 10 లక్షల రూపాయలు తీసుకొని కేసు రాజీ చేసుకోవాలని పోలీసులు ఒత్తిడి తెచ్చినట్లు రమాదేవి పేర్కొన్నారు. కేసు నమోదై వారం రోజులు దాటినప్పటికీ అనుమానితుల పై చర్యలు తీసుకోకపోవడం, రాజీ చేసుకోవాలంటూ రమాదేవి పై ఒత్తిడి తెచ్చి పోలీసులు కొట్టడం తదితరాలపై సానిక ప్రజా సంఘాలు ఆగ్రహం హం వ్యక్తం చేస్తున్నాయి.
రమాదేవి ని కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, రవి మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా చేశాయి. అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశాయి. ఈ విషయంలో లో తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని ప్రజా సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి.
కానిస్టేబుళ్ల సస్పెన్షన్, నిందితుడి అరెస్ట్
భర్త మృతదేహం అనుమానాస్పద స్థితిలో దొరికితే.. న్యాయం చేయమని ఆశ్రయించిన మహిళను విచక్షణా రహితంగా కొట్టిన ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు. వారిపై శాఖాపరమైన విచారణ జరగనున్నట్లు తెలిపారు. అలాగే ఈ కేసులో నిందితుడు థనశేఖర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.