కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ వార్త రాజకీయ సంచలనం కలిగించింది. రేవంత్ రెడ్డికి ఈ అరెస్టులు కొత్త కాదు. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో విషాదం చోటు చేసుకున్న 9మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘటనా స్థలాన్ని సందర్శించడానికి వెళ్తున్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవిలను పోలీసులు అరెస్ట్ చేశారు.నాగర్ కర్నూల్ జిల్లా దిoడి లోని కట్ట మైసమ్మ ఆలయం సమీపంలో పీసీసీ వర్కింగ్ ప్రెసెంట్ ఎంపీ రేవంత్ రెడ్డిని ఉప్పు నుంతల పోలీసులు అరెస్టు చేయడం ఈ సంచలనానికి కారణమైంది.
రేవంత్ రెడ్డి శనివారం ఉదయం శ్రీశైలం ఎడమ గట్టు పవర్ స్టేషన్ లో జరిగిన స్థలానికి వెళ్తుండగా మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మల్లు రవి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో రాజకీయవాతావరణం వేడెక్కింది. పోలీసులపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న వారిని ఇలా అరెస్టు చేయడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు.
శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష నేతలకు లేదా? అంటూ ఆయన ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో ఆయన కొద్దిసేపు వాగ్వాదానికి కూడా దిగారు. బాధితులను పరామర్శించి, వారికి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అడగాల్సి ఉందని, ఈ క్రమంలోనే తన అరెస్టు జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగింది ప్రమాదమా ? కుట్రా అని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు.
జగన్ జల దోపిడీకి కేసీఆర్ సహకరించి విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతుందని ముందే చెప్పా మని , ప్రస్తుత పరిణామం ఆ అనుమానాలకు తావిస్తోందని ఆయన సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనపై సీఐడీ దర్యప్తు జరుగుతోంది. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కూడా ఆయన డిమాండు చేస్తున్నారు. రేవంత్ అరెస్టు వ్యవహారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కదలికి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి అరెస్టులకు పాల్పడటం దారుణమని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.