కరోనా వల్ల నష్టాల్లో కూరుకుపోయిన రంగాల్లో సినీ రంగం ఒకటి. థియేటర్లు నడిస్తేనే సినిమాలు రిలీజ్ అవుతాయి, సినిమాలు రిలీజ్ అవ్వాలంటే షూటింగులు పూర్తి కావాలి, షూటింగులు జరిగితేనే నటీనటులకు, టెక్నీషియన్స్‌కు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. అలాగే థియేటర్లు రన్ అయితేనే యాజమాన్యం, కార్మికులు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఇలా ఒకదానికొకటి లింగ్ ఉండడం వల్ల చాలా పెద్ద ఎత్తున సినీపరిశ్రమ నష్టపోయింది. గత ఆరు నెలలుగా థియేటర్లు లేకపోవడం వల్ల రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న సినిమాలు, పూర్తి కావచ్చిన సినిమాలు, సగం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం థియేటర్లు, మల్టీప్లెక్సులు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇది సినీ పరిశ్రమకు శుభవార్తే. అయితే సినిమాలు చూసేందుకు జనం థియేటర్లకు వస్తారా లేదా అనే సందేహం అందరిలోనూ ఉన్నప్పటికీ ఆరు నెలలుగా ఇంటిపట్టునే సినిమాలు చూస్తూ విసిగి వేసారిపోయిన ఆడియన్స్ మాత్రం థియేటర్లకు తరలి రావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటివరకు షూటింగులు లేవని రిలాక్స్ అయిపోయిన దర్శకనిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్స్ కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఒక్కసారిగా ఎలర్ట్ అయిపోయారు. తమ తమ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ అవకాశం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రాజమౌళి తమ యూనిట్ సభ్యుల్ని షూటింగ్‌కి సిద్ధం కమ్మని ఆదేశించాడు. భారీ అంచనాల మధ్య ప్రారంభమైన ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. నిన్న మొన్నటి వరకు జనవరి వరకు షూటింగుల్లో పాల్గొనేది లేదని చెప్పిన స్టార్ హీరోలు కూడా కెమరా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న అలియా భట్, ఓలియా మోరిస్ హైదరాబాద్ చేరుకున్నారని తెలుస్తోంది. లాక్‌డౌన్ సమయంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్‌ని స్టార్ట్ చేద్దామని ప్రయత్నించిన రాజమౌళికి ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అన్నీ పక్కాగా చూసుకొని నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేసి సినిమాని పూర్తి చెయ్యాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగుతున్నాడు రాజమౌళి. 2021 సమ్మర్ కి సినిమాను రిలీజ్ చెయ్యాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాగా ఆలస్యమైన ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి వచ్చే సమ్మర్‌కి ఆర్ ఆర్ ఆర్‌తో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.











