వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో హిందూ ఆలయాల మీద దాడులు పెరుగుతున్నాయనే వాదన ఇటీవలే ప్రబలంగా వినిపిస్తోంది. వాస్తవంలో కూడా హిందూ ఆలయాల మీద దుర్ఘటనలు పెరుగుతున్నాయి. వాటన్నింటికంటె మించినది ప్రభుత్వం తరఫునుంచి కనిపిస్తున్న ఉపేక్ష భావం. ఆ ఉపేక్ష పట్ల ప్రజల్లో కూడా చాలా రకాల భయాలు పుడుతున్నాయి.
అయితే కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు.. వాటినుంచి రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రతి పార్టీ కూడా ప్రయత్నిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనధికారికంగా తామే నెంబర్ టూ అని ఎప్పుడో ప్రకటించుకున్న బీజేపీ హిందూత్వ కార్డును వాడుకుని ఎడాపెడా రెచ్చిపోయి.. ప్రజల్లో హిందూ అభిమానుల్ని, ఒకరకమైన అతివాదుల్ని ఏకతాటిమీదకు తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని భావించడంలో వింత లేదు. రాజకీయంగా హిందూత్వ కార్డును వాడుకోవడం తమ పేటెంటు అని బీజేపీ దళాలు భావిస్తుంటాయి. ఇప్పుడు వారికి ఏపీలో ఇటీవలి దుర్ఘటనల రూపంలో అవకాశం అందివచ్చింది గనుక రెచ్చిపోతున్నారు.
చంద్రబాబు నాయుడు ఎందుకు రెచ్చిపోతున్నారు..
బీజేపీ హిందూత్వ పోరాటాల్ని నెత్తికెత్తుకుంటే ఆశ్చర్యం లేదు. కానీ.. వారిని మించిన ఆవేశం చంద్రబాబునాయుడులో కూడా కనిపిస్తోంది. ఆలయాల మీద దాడులు జరిగినప్పుడు స్పందించడం అనేది ప్రతిపక్ష నాయకుడిగా ధర్మం. దాన్ని గురించి ఏమీ అనలేం. కానీ తిరుమల శ్రీవారి ఆలయానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయడం వంటి అంశం గురించి భాజపా వారికంటె ఎక్కువగా చంద్రబాబు కూడా డిమాండ్లు వినిపించారు.
గత ఏడాది జగన్ వెళ్లినప్పుడు ఆయన నోరు మెదపలేదు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు జగన్ తిరుమల దర్శనానికి వెళితే.. ఆయన సంతకం గురించి పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడు ఏదో ఈ అంశానికి పొలిటికల్ గా మార్కెట్ బాగా ఉన్నదని అనిపించిందేమో గానీ రెచ్చిపోయారు.
ఒక దశలో ఏపీలో హిందూత్వ ఎజెండాకు ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ తానే అన్నంత స్థాయిలో చంద్రబాబు రెచ్చిపోయారు.
బాబు ఏం ఆశించారో..
ఇంత ఘాటుగా హిందూత్వ ఎజెండాను నెత్తికెత్తుకోవడం ద్వారా ఇంతకూ ఆయన ఏం ఆశించినట్టు అనేది పెద్ద ప్రశ్న. జగన్ ను హిందూత్వానికి దూరం చేయడం ఒక పాయింట్ కావచ్చు. కానీ.. దానికంటె ఎక్కువగా.. బీజేపీ లేవనెత్తిన అంశాన్ని తన భుజాలపై మోయడం ద్వారా.. ఆ పార్టీకి దగ్గర కావచ్చునని ఆయన భావించారేమో తెలియదు. అసలే.. ఆయన భాజపా కూటమితో సాన్నిహిత్యం కోసం చాలా కాలంగా ఉత్సాహపడుతున్నారనే ప్రచారం పుష్కలంగా ఉంది. అలాంటి నేపథ్యంలో.. చంద్రబాబునాయుడు హిందూత్వ ఎజెండాను తీసుకోవడం ఎవ్వరికైనా ఇలాంటి అభిప్రాయాన్నే కలిగిస్తుంది.
అది వర్కవుట్ అయ్యేదేనా?
రాష్ట్ర బీజేపీ మాత్రం.. తమ ప్రధాన శత్రువు పాలక పక్షం కాదు.. చంద్రబాబునాయుడే అన్నంత రీతిలో చెలరేగిపోతున్న సంగతి అందరికీ తెలుసు. ప్రత్యేకించి సోము వీర్రాజు సారథి అయ్యాక.. జగన్ ను పల్లెత్తు మాట అనడం కూడా మానేసి.. చంద్రబాబు మీదనే విరుచుకుపడుతున్నారు. హిందూ ఆలయాల మీద దాడులు జరిగితే, చంద్రబాబు వాటి గురించి గళమెత్తితే.. తమ వాదనకు మద్దతు దొరికిందని సంబరపడే బదులుగా.. చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని దాడులు జరిగాయో లెక్కలు తీస్తున్నారు.
రాష్ట్ర శాఖతో సంబంధాలు ఇలా ఉప్పు-నిప్పులా ఉండగా.. కేంద్రంలోని భాజపాతో మాత్రం బంధం పెనవేసుకోవడం వారికి సాధ్యమేనా అనే అభిప్రాయం పలువురిలో ఉంది. హిందూత్వాన్ని ఎంతగా ఆయన మోసినప్పటికీ.. భాజపా దగ్గరకు తీసుకుంటుందనే గ్యారంటీ మాత్రం ఎవ్వరికీ లేదు.
చంద్రబాబు- వైసీపీ ఉచ్చులో పడ్డారా?
ఇంకో కోణం లోంచి ఈ మొత్తం హిందూత్వ ఎపిసోడ్ ను చూసినప్పుడు- మరో చిత్రమైన వాదన కూడా వినిపిస్తోంది. హిందూత్వ ముగ్గులోకి చంద్రబాబును లాగడం అనేది ఒక రకంగా వైసీపీ-జగన్ వేసిన స్కె్ అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఆ రకంగా వైసీపీ విసిరిన ఉచ్చులో చంద్రబాబు చిక్కుకున్నారనే వాదన వస్తోంది.
హిందూత్వ అంశాన్ని తీవ్రస్వరంతో లేవనెత్తడం ద్వారా.. చంద్రబాబు కూడా అతిగా స్పందిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన ప్రెస్ మీట్లు గమనిస్తే.. ఒక ప్రముఖ హిందూ వాద నాయకుడి రేంజిలో ఉంటున్నాయి. చంద్రబాబు మీద ఇలాంటి ముద్ర వేయగలిగితే.. తటస్థ వాదుల్లో, ఇతర మతాల వారిలో తమ ప్రాబల్యం మరింత పటిష్టం అవుతుందనే ఆలోచనతో వైసీపీ ఇలాంటి ఉచ్చు విసిరినట్లుగా ఒక వాదన వినిపిస్తోంది.
ఎలా నష్టపోతారు?
జగన్ వ్యతిరేకత మోజులో- హిందూత్వ వాదాన్ని నెత్తికెత్తుకునే ప్రకటనల ద్వారా చంద్రబాబునాయుడు సాహసం చేశారనే అనుకోవాలి. దళిత క్రిస్టియన్ వర్గాల్లో ఎటూ తన ఓటు బ్యాంకును నిర్మించుకోవడం అసాధ్యం అయిన ప్రస్తుత పరిస్థితుల్లో.. కనీసం హిందూవాద ఓటు బ్యాంకుకు జగన్ ను దూరం చేయడంలోనైనా సక్సెస్ అయితే తనకు అదే చాలని చంద్రబాబు అనుకుని ఉండొచ్చు.
కానీ.. ఈ విషయంలో వైసీపీ వ్యూహం మరొక రకంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలుగుదేశం అధినేత పదేపదే హిందూ ఎజెండాతో మాట్లాడేలా చేస్తే గనుక.. ఆ పార్టీకి తొలినుంచి ఇప్పటి వరకు కూడా అంతో ఇంతో బలమైన సానుభూతిపరులుగా ఉంటున్న ముస్లింలను కూడా దూరం చేయవచ్చుననేది వారి వ్యూహంగా వినిపిస్తోంది. దళిత- క్రిస్టియన్ వర్గాల్లో ఎటూ వైసీపీ చాలా బలంగా ఉన్నట్లే లెక్క. దానికి తోడు ముస్లిం వర్గాల్ని తెలుగుదేశానికి దూరం చేయగలిగితే.. ఆటోమేటిగ్గా.. ఆ ఓటు బ్యాంకు వైసీపీ వైపే మళ్లుతుంది. మతవాద బీజేపీతో గానీ, వారితో జట్టు కట్టిన జనసేనతో గానీ.. ముస్లింలు కలిసి నడవడం అసాధ్యం.
ఆ సమీకరణల ప్రకారం- వైసీపీ బలం బాగా పెరుగుతుంది. ఆ రకంగా కొన్ని వర్గాల్లో వైసీపీకి సాలిడ్ ఓటు బ్యాంకు తయారవుతుంది. అదే సమయంలో హిందూ అతివాదులు కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద బీజేపీనే ఎంచుకుంటారు.. చంద్రబాబుకు మతం కార్డు మీద దక్కే హిందూ ఓట్లు తక్కువగానే ఉంటాయి. ఆ ఓటు బ్యాంకు చీలుతుంది. కాబట్టి అన్ని రకాలుగానూ తామే ఎడ్వాంటేజీ లో ఉంటాం అని వైఎస్సార్ కాంగ్రెస్ లెక్కలేస్తున్నట్లుగా చెబుతున్నారు.
మరి, అపరా రాజకీయ చాణక్యుడిగా పేరున్న చంద్రబాబునాయుడు.. వైసీపీ ఉచ్చులో అంత సులువుగా చిక్కుకున్నారా? వారి స్కెచ్ ను పసిగట్టలేకపోయారా? అనేది తెలీదు. ఒకవేళ అలాంటి స్కెచ్ లు ఉన్నా కూడా.. వాటికి విరుగుడు మంత్రం ఇప్పటికే ఆయన అన్వేషించి ఉంటారులెమ్మని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు.