ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కి పరిచయమైన అందమైన భామల్లో నభా నటేశ్ ఒకరుగా కనిపిస్తుంది. ముద్దుగా .. బొద్దుగా ఉండే ఈ పిల్ల అందమైన అగ్గిపుల్లగా అనిపిస్తుంది .. అబ్బాయిల హృదయాలను అగ్నిపర్వతాల మాదిరిగా మార్చేస్తోంది.ప్రస్తుతం నడుస్తున్న ట్రెండులో నాయిక నటనతో పనిలేదు. ఏదో ఫైటుకు ఫైటుకు మధ్య హీరో కాస్త రిలాక్స్ కావాలనుకున్నప్పుడు, అందమైన కాళ్లను .. చేతులను డాన్స్ పేరుతో అలా అలా కదిలిస్తే సరిపోతుంది. ఇక్కడ ఆడియన్స్ కి కావలసినదెల్లా ఆమె గ్లామరస్ కనిపించడమే .. ఆ గ్లామరసాన్ని గంపలకొద్దీ గుమ్మరించడమే.
తెరపై కనువిందు చేయాలంటే .. కెరియర్ పరంగా ముందుకు వెళ్లాలంటే గ్లామరస్ గా కనిపించాలనే విషయాన్ని నభా నటేశ్ బాగానే పసిగట్టేసింది. అందుకే ‘నన్ను దోచుకుందువటే’ సినిమా నుంచి చకచకా అవకాశాలను అందుకుంటూ వెళుతోంది. అందాలు ఉన్నదే ఆరబోయడానికీ .. పడుచు గుండెలకు చేరవేయడానికి .. నరాల తీగలపై ఆరేయడానికి అన్నట్టుగా ‘ఇస్మార్ట్ శంకర్‘ సినిమాలో ఆమె చెలరేగిపోయింది. పిల్ల పిప్పరమెంటులా ఉందనుకుంటూ కుర్రాళ్లంతా కూడబలుక్కుని హిట్టు పత్రం రాసేసి ఆమె చేతిలో పెట్టేశారు. ఆమె ఒయ్యారాలను చూస్తూనే ఉంటామని ఒట్టేశారు.
ఇక అప్పటినుంచి వడియాలు ఆరబోసినంత తేలికగా ఒయ్యారాలను ఒలకబోస్తూ నభా నటేశ్ మరింత స్పీడ్ పెంచింది. ‘సోలో బ్రతుకే సో బెటర్‘ సినిమాలో అందాల సందడి చేసిన ఈ అమ్మాయి, చాలా తక్కువ గ్యాపులో ‘అల్లుడు అదుర్స్‘ సినిమాతో పలకరించింది. సంక్రాంతి అంటే అల్లుళ్ల పండుగ గనుక, ఈ సినిమా చూసినవాళ్లు కొత్త అల్లుడు కొంటెవాడే అంటున్నారు. అల్లుడి పక్కన అమ్మాయేమీ తగ్గలేదని కూడా చెప్పుకుంటున్నారు. అంతగా ఆమె పడుచు అందాలను పాపిడీ మిఠాయిలా పంచిపెట్టేసింది. ఈ సినిమా రిజల్ట్ సంగతి అటుంచితే, నభా జోరు మరింత పెరగడం ఖాయమని అభిమానులు సీట్లు గుద్ది మరీ చెబుతున్నారు.
Must Read ;- ట్రైలర్ టాక్ : కామెడీ, హారర్, యాక్షన్ ప్యాక్ ‘అల్లుడు అదుర్స్’